T20 World Cup 2024 : మహిళల క్రికెట్ పండుగకు మరో పది రోజుల్లో తెరలేవనుంది. అదేనండీ.. టీ20 వరల్డ్ కప్ పోటీలు షురూ కానున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ అధికారిక పాటను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. ‘వాటెవర్ ఇట్ టేక్స్’ (Whatever It Takes) తెలుగులో ‘ఏదైనా చేసేద్దాం’ అనే అర్థ వచ్చే టైటిల్ పాట వీడియో ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది.
క్రికెట్ జాతరకు ముందే అభిమానులకు పూనకాలు తెప్పించిన ఈ వీడియో క్షణాల్లోనే తెగ వైరల్ అయింది. ఇంతకూ ఆ పాటలో ఆడి, పాడిన బ్యాండ్ ఎవరిదంటే.. భారత అమ్మాయిలదే. అవును. ‘విష్’ (W.I.S.H)గా పాపులర్ అయిన ఆ నలుగురు నర్తించి.. అలరించిన వాటెవర్ ఇట్ టేక్స్ పాట అభిమానుల్లో అప్పుడే వరల్డ్ కప్ జోష్ నింపుతోంది.
తొమ్మిదో వరల్డ్ కప్ సీజన్ కోసం ఐసీసీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ కప్ ట్రోఫీ వరల్డ్ టూర్ ముగియడంతో టోర్నీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ క్రేజ్‌ను మరింత పెంచేందుకు థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటలో డ్యాన్సులతో ఇరగదీసే అవకాశం మనదేశానికి చెందిన విష్ బ్యాండ్‌కు దక్కడం విశేషం. సంగీతంపై పిచ్చి ప్రేమ ఉన్న నలుగురు అమ్మాయిదే ఈ బ్యాండ్.
రియా దుగ్గల్ (Riya Duggal), సిమ్రాన్ దుగ్గల్(Simran Duggal), జో సిద్ధార్థ్ (Zoe Siddharth), సుచితా శ్రింక్ (Suchita Shrink)లు ఇందులో సభ్యులు.. వీళ్లు రీ, సిమ్, జో, సుచీ పేర్లలో చాలా పాపులర్. ఈకాలం కుర్రకారు విష్ బ్యాండ్ ఆల్బమ్స్‌కు ఫిదా అవుతున్నారు. హిందీ, ఇంగ్లీష్ మేళవింపుతో పాటలు కట్టే వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఇప్పటివరకూ ఈ నలుగురు విడుదల చేసిన ‘హెడ్రుష్లేటెస్ట్ రిలీజ్’, ‘గాల్టీ(ఫీట్ మ్యాక్స్ ఆర్జెడ్ఐ) 2024’, ‘లజీజ్2024’, ‘హెడ్రుష్’, ‘థెరపీ’ ఆల్బమ్ మస్త్ పాపులర్ అయ్యాయి. తమ బ్యాండ్ గీతాలతో వైరల్ అయిన ఈ అమ్మాయిలకు ఐసీసీ వరల్డ్ కప్ పాటలో అవకాశం ఇచ్చింది. ఇంకేముంది.. విశ్వమంతా దద్ధరిల్లేలా తమ డ్యాన్సులతో అదరగొట్టింది విష్ బ్యాండ్.