ఖమ్మం కమాన్బజార్, ఫిబ్రవరి 27 : భూదాన్ భూముల్లో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి, వారిని గెంటివేయడమే ఇందిరమ్మ రాజ్యమా.. అని వామపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూదాన్భూముల్లో ఇండ్లు కట్టుకొని, గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలకు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు దౌర్జన్యంగా జేసీబీలు, బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. ఈ ఘటనను చూస్తుంటే గాజాపై ఇజ్రాయెల్ చేసిన దమనకాండ గుర్తుకొస్తున్నదని చెప్పారు.
ఖమ్మంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామపక్ష నేతలు నున్నా నాగేశ్వరరావు, దండి సురేశ్, ఆవునూరి మధు, గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఖమ్మం శివారు వెలుగుమట్లలో పదేండ్ల నుంచి ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారిని ఇండ్లను కూల్చడంతో పేదలందరూ రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.
బడాబాబుల భూములను క్రమబద్ధీకరణ చేస్తు న్న ప్రభుత్వం పేదల ఇండ్లను ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని ప్రశ్నించారు. 62 ఎకరాల్లో కేవలం 32 ఎకరాల్లో ఉన్న పేదల ఇండ్లను కూల్చివేశారని, మిగిలిన భూమి ఏమైందో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.