హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో అధికార దౌర్జన్యం, 600 ఇండ్ల కూల్చివేతపై జాతీయ మావన హక్కుల కమిషన్ ఫిర్యాదును స్వీకరించింది. ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు ఖమ్మం కలెక్టర్, అదనపు కలెక్టర్‌పై కేసు నమోదు చేసుకుంటూ 4383/ఇన్/2026 డైరీ నంబర్ వెల్లడించింది. వెలుగుమట్లలో సర్వే నంబర్లు 147, 148, 149లలో భూదాన్ భూములపై గతంలో స్టేటస్ కో విధించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, భూదాన్ ప్రాథమిక ఉద్దేశం పేదలకు భూములు ఇవ్వడమేనని చెప్పింది.
పేదలు ఇండ్లు కట్టుకున్న భూములపై నిషేధం లేదని, ఆ నిషేధ ఉత్తర్వులపై ఆర్సీ సంఖ్య డీసీవో/ఈ /వోటీహెచ్ఈ/0082/2025 పై అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జడ్జి, సీసీఎల్ఏ కమిషనర్‌తో కమిటీ ఏర్పాటు చేయాలని గతంలోనే ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయాన్ని న్యాయవాది వివరించారు.
కాగా, న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు చేస్తూ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నదని.. కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించాలంటూ న్యాయవాది కోరారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు.