ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 27 : కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంచేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం)లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన బాధితులను పెయిడ్ ఆర్టిస్టులంటూ హైదరాబాద్లో గురువారం ప్రెస్మీట్లో మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం గర్హనీయమని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ బూటకమని తేలిపోయిందని విమర్శించారు.
ప్రభుత్వ భూములైనా, భూదాన భూములైనా పేదలందరికీ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామంటూ నిండు చట్టసభలో సీఎం ఇచ్చిన మాటను గుర్తుచేశారు. వెలుగుమట్లలోని భూదాన భూముల్లో పేదలు ఇండ్లు కట్టుకుంటే ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. మంత్రుల స్వలాభం కోసమే పేదల ఇండ్లను నేలమట్టం చేశారని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు చెప్పిన ప్రతి మాటనూ వింటూ చట్టవిరుద్ధ పనులు చేస్తున్న అధికారులంతా జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వెలుగుమట్ల భూదాన్ భూముల్లోనే పేదలకు ఇండ్లు నిర్మించి, దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు.