Deepak Hooda : భారత యువ క్రికెటర్ దీపక్ హుడా (Deepak Hooda) పెండ్లి చేసుకున్నాడు. 9 ఏండ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయిని ఈమధ్యే మనువాడాడు. జూలై 15వ తేదీన ఈ ఇద్దరు దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం హుడా వివాహతంతు కన్నుల పండువగా జరిగింది. అయితే.. ఈ విషయాన్ని హుడా ఆలస్యంగా వెల్లడించాడు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ఆల్‌రౌండర్ తనకు పెండ్లి అయిందనే విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
‘తొమ్మిదేండ్ల నిరీక్షణ, ప్రతి క్షణం, ప్రతి కల, ప్రతి మాట.. ఇవన్నీ ఈ అందమైన రోజుకు కారణమయ్యాయి. మేము ఇంతకాలం మా ప్రేమ వ్యవహారాన్ని సాగదీసినందుకు మన్నించండి. ఇన్నేండ్లలో మేము మా హృదయాలకు మాత్రమే అర్థమయ్యే కథలు చెప్పుకున్నాం. చివరకు మేము ఒకరికి ఒకరం దొరికాం.
మా ఇంటికి సుస్వాగతం. నా చిన్నారి పొన్నారి హిమాచల్ అమ్మాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆశ్వీర్వదించగా మేమిద్దరం ఒక్కటయ్యాం. మా హృదయాలు మీ ప్రేమతో నిండిపోయాయి. అందరికీ ధన్యవాదాలు’ అంటూ హుడా తన ప్రణయ గాథను వివరించాడు. అయితే.. ఎక్కడా కూడా హుడా తాను పెండ్లి చేసుకున్న అమ్మాయి పేరు మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.

ఆల్‌రౌండర్ అయిన హుడా టీమిండియాకు ఆడింది తక్కువ మ్యాచ్‌లే. ఐపీఎల్ ఫామ్‌తో జట్టులోకి వచ్చినప్పటికీ నిలకడ లేమితో 21 టీ20లు, 10 వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. ప్రస్తుతం అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)కు ఆడుతున్నాడు. అయితే.. 17వ సీజన్లో హుడా ఒక్క హాఫ్ సెంచరీతో కలిపి 145 పరుగులు చేసి నిరాశ పరిచాడు.
