లక్నో: కన్వర్ యాత్ర (Kanwar Yatra) మార్గంలోని ఈటరీలు తమ యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు నిబంధన విధించారు. ముజఫర్‌నగర్ పోలీసులు జారీ చేసిన ఈ సూచనను బీజేపీ మిత్ర పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కులం లేదా మతం పేరుతో విభజన సృష్టించే దేనికీ తాను మద్దతు ఇవ్వనని తెలిపారు. సమాజంలో ధనిక, పేద అనే రెండు వర్గాల ప్రజలు ఉన్నారని చెప్పారు. వివిధ కులాలు, మతాలకు చెందిన వ్యక్తులు రెండు వర్గాలలో ఉంటారని తాను నమ్ముతున్నానని తెలిపారు. ‘ఈ రెండు వర్గాల ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించాలి. దళితులు, వెనుకబడినవారు, అగ్రవర్ణాలు, ముస్లింలు వంటి సమాజంలోని అన్ని వర్గాలను కలిగి ఉన్న పేదల కోసం పనిచేయడం ప్రతి ప్రభుత్వం బాధ్యత. అందరి కోసం పని చేయండి’ అని అన్నారు.
కాగా, పోలీసుల ఆర్డర్‌ను సమీక్షించాలని బీజేపీ కీలక మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్) ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. యూపీలో కంటే బీహార్లోనే కన్వర్ యాత్ర పెద్దగా సాగుతుందని ఆ పార్టీ నేత కేసీ త్యాగి తెలిపారు. ప్రధానమంత్రి మాట్లాడే ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ను ఈ నిబంధనలు ఉల్లంఘించాయని విమర్శించారు. కన్వర్ యాత్ర సాగే బీహార్, రాజస్థాన్, జార్ఖండ్‌లో ఇలాంటివి అమలులో లేవన్నారు.
మరో బీజేపీ మిత్రపక్షమైన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిబంధనను తప్పుపట్టింది. నేమ్ప్లేట్లను చూపించమని విక్రేతలను కోరడం ఖచ్చితంగా తప్పు అని ఆర్ఎల్డీ జాతీయ ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి అన్నారు. ‘రాజకీయ నాయకులను నేను అడగాలనుకుంటున్నా. మద్యం సేవించడం మతపరంగా మిమ్మల్ని భ్రష్టు పట్టించలేదా? మాంసాహారం తిన్నప్పుడే ఇలా జరుగుతుందా?’ అని ప్రశ్నించారు. మద్యపానాన్ని కూడా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.