Hockey World Cup : ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరుదేశాల మధ్య క్రికెట్ కాదు కదా.. ఇతర ఏ ఆట కూడా సాధ్యంకాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాయాదిల మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు లభించింది. పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్ (Mens Junior Hockey World Cup )లో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండడమే అందుకు కారణం.
తమిళనాడులోని చెన్నై, మధుర వేదికగా జరుగనున్న హాకీ వరల్డ్ కప్ షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లోని లసాన్నేలో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రమ్ (Tayyab Ikram) డ్రా తీశారు. అందులో.. గ్రూప్ బీలో ఇండియా, పాకిస్థాన్ టీమ్‌లతో పాటు చిలీ, స్విట్జర్లాండ్‌లకు చోటు దక్కింది.
FIH Hockey Men’s Junior World Cup 2025: Pools revealed!
Read more : https://t.co/caj2HSdDzB pic.twitter.com/bXtuWQ5f34— Asian Hockey Federation (@asia_hockey) June 28, 2025
భారత్ ఆతిథ్యమిస్తున్న పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్ చెన్నైలో నవంబర్ 28న ప్రారంభం కానుంది. డిసెంబర్ 10 వరకూ జరగునున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 24 జట్లు పోటీపడనున్నాయి. ఈ టీమ్‌లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ఏలో జర్మనీ, దక్షిణాఫ్రికా, కెనడా, ఐర్లాండ్ జట్లు ఉండగా.. గ్రూప్ సీలో అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్, చైనా పోటీ పడుతున్నాయి. గ్రూప్ డీలో స్పెయిన్, బెల్జియం, ఈజిప్ట్, నమీబియా ఉన్నాయి. గ్రూప్ ఈ నుంచి నెదర్లాండ్స్ మలేషియా, ఇంగ్లండ్, ఆస్ట్రియాలు .. గ్రూప్ ఎఫ్ నుంచి ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కొరియా, బంగ్లాదేశ్‌లు బరిలోకి దిగనున్నాయి.
మనదేశంలో పురుషుల హాకీ జూనియర్ వరల్డ్ కప్ నిర్వహించడం ఇది మూడోసారి. 2016లో లక్నో, 2021లో భువనేశ్వర్ నగరాల్లో వరల్డ్ పోటీలు విజయవంతం అయినందున తమ రాష్ట్రంలోనూ ఘనంగా జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. వరల్డ్ కప్ టోర్నీ ప్రచారం నిమిత్తం జూన్ 19 రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) లోగోను ఆవిష్కరించారు.