దామరచర్ల, జూన్ 28 : హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25 నుండి 27 వరకు జరిగిన 8వ ఓపెన్ జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల్లో నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన విద్యార్థులు 9 పతకాలు సాధించారు. మండల కేంద్రంలోని రమేశ్ తైక్వాండో కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న అన్నేం అఖిల్ రెడ్డి, తాటిసాయి వెంకట్, గోలి దేవేంద్రనాథ్ ఈ ముగ్గురికి బంగారు పతకాలు, కేశగోని దేవకీనందన్ కు రజత పతకం, దారగని సాయి ఈశ్వర్, కేశగోని జ్ఞానదీప్, యార్రం విరించిత్ నందన్ రెడ్డి, అల్లంపల్లి భువనేశ్వర్, బండెలగం అనిల్ కుమార్ జోషి కాంస్య పతకాలను గెలుచుకున్నారు. విజేతలకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీకాంత్ రెడ్డి, శాంతినికేతన్ ప్రిన్సిపాల్ లిమా మేరీ సిస్టర్, కుందూరు బాలకోటిరెడ్డి అభినందనలు తెలిపారు.