ICC : ఇటీవల భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లు భవిష్యత్లో కష్టమే అనిపిస్తోంది. త్వరలో జరుగబోయే ఆసియా కప్ (Asia Cup) నుంచి టీమిండియా నిష్క్రమించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై వరల్డ్ కప్ లాంటి ఐసీసీ ఈవెంట్ల (ICC Events)లో మాత్రమే దాయాది జట్లు ఆడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇండో, పాక్ జట్ల భవితవ్యంపై ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చ జరుగనుంది. సింగపూర్ వేదికగా జూలై 17 నుంచి 20 వరకూ జరిగే ఈ సమావేశంలో ఇదే విషయంపై చర్చిస్తామని ఐసీసీ వర్గాలు అంటున్నాయి.
క్రికెట్లోని గొప్ప సమరాల్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఒకటి. కానీ, ఈమధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వచ్చ ఏడాది టీ20 వరల్డ్ కప్ సందిగ్ధంలో పడనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్వం ఇవ్వనున్న ఈ టోర్నీ భవితవ్యంపై.. ఆసియా కప్లో టీమిండియా ఆడడంపై ఐసీసీ వార్షిక సమావేశంలో స్ఫష్టత రానుందని టాక్. ‘భారత్, పాకిస్థాన్ జట్లు నాకౌట్ మ్యాచుల్లో తలపడాల్సి రావొచ్చు. అలాంటప్పుడు ఏం చేయలేం. కానీ, లీగ్ దశలో ఇరుజట్లను ఒకే గ్రూప్లో ఉండకుండా చూడడం మాత్రం సాధ్యమవుతుంది. ఎందుకంటే. ఐసీసీ చీఫ్గా జై షా (Jai Shah) ఉండడంతో.. బీసీసీఐకి అనుకూలంగా నిర్ణయం వెలవడే అవకాశం ఉంద’ని అని ఐసీసీ వర్గాలు అంటున్నాయి.
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి.. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) అనంతరం.. భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లకు ఇక తెరపడినట్టే అని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. ఇకపై ఐసీసీ ఈవెంట్లలో తమను పాక్ ఉన్న గ్రూప్ చేర్చవద్దని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla)లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. పాక్ ఆతిథ్యమిచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను తటస్థ వేదికపై ఆడిన విషయం విదితమే.