ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో.. ‘క్వైట్ బర్నౌట్’ క్రమంగా పెరిగిపోతున్నది. పైకి మామూలుగా కనిపించే ఉద్యోగుల్లో.. లోలోపల ఒత్తిడి అధికమవుతున్నది. మానసికంగా, శారీరకంగా అలసిపోయి.. సగటు ఉద్యోగిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఫలితంగా, వారిలో పనిపై ఆసక్తి తగ్గుతున్నది. ఉత్సాహం కరువై పోతున్నది. ఈ క్రమంలో ‘క్వైట్ బర్నౌట్’కు చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నది.
ఉద్యోగుల్లో ‘బర్నౌట్’ గురించి తెలిసిందే! విపరీతమైన అలసట వల్ల చాలామంది పని మానేస్తుంటారు. లేదా దీర్ఘకాలిక సెలవులు తీసుకుంటారు. కానీ ‘క్వైట్ బర్నౌట్’ ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఉద్యోగులు పనిని వదిలిపెట్టరు. ఆఫీసుకు రెగ్యులర్‌గా వస్తూ.. అప్పగించిన పనులన్నీ పూర్తి చేస్తారు. కానీ, వారిలో మునుపటి ఉత్సాహం కనిపించదు. లోలోపల తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తూ.. పని పట్ల పూర్తి విరక్తిని పెంచుకుంటున్నారు. అలా.. ఒక నిశ్శబ్ద పోరాటాన్ని సాగిస్తారు.
క్వైట్ బర్నౌట్లో ఉన్న ఉద్యోగులు.. అంతా యాంత్రికమైన పని తీరును చూపిస్తుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని చూపించలేరు. సృజనాత్మకంగా ఆలోచించడం మానేస్తారు. కేవలం జీతం కోసం మాత్రమే పని చేస్తారు. పని విషయంలోనే కాదు.. తోటి ఉద్యోగులతోనూ అంటీముట్టనట్టుగానే ఉంటారు. ఎవరితోనూ కలవరు. ఆఫీసు ఈవెంట్లనూ దూరం పెడతారు. అయితే, ఇవన్నీ ఉద్యోగుల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అదే సమయంలో.. సంస్థకూ నష్టాన్ని తెచ్చిపెడుతాయి. గతంలో చురుగ్గా పనిచేసిన ఉద్యోగులు, ఇప్పుడు చిన్న పనిని
పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటారు. ఆసక్తి తగ్గిపోవడంతో నాణ్యత కూడా దెబ్బతింటుంది. అంతా కలిసి ఉత్పాదకతపై ప్రతికూల
ప్రభావం పడుతుంది.
నేటితరం ఉద్యోగుల్లో ‘క్వైట్ బర్నౌట్’ చాలా కామన్‌గా కనిపిస్తున్నది. చాలాకాలం పాటు విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వారి మెదడు మొద్దుబారిపోతున్నది. ఇది క్రమంగా డిప్రెషన్, నిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది. ఇక అనేక సంస్థల్లో ఎంత కష్టపడినా ఫలితం మాత్రం శూన్యమే అవుతున్నది. యాజమాన్యం నుంచి ప్రశంసలు, తగిన గుర్తింపు కరువై పోతున్నది. దాంతో, ఉద్యోగుల్లో నిరాశ-నిస్పృహలు ఆవహిస్తున్నాయి. మరికొందరిలో ప్రతిరోజూ ఒకే రకమైన పని చేయడం వల్ల.. దీర్ఘకాలంలో ఆ పనిపై విరక్తి కలుగుతున్నది.
క్వైట్ బర్నౌట్ నుంచి బయట పడాలంటే.. మొదట మీ స్థితిని గుర్తించాలి. పనిగంటలు ముగిసిన తర్వాత ఆఫీస్ వర్క్ పూర్తిగా పక్కన పెట్టేయాలి. కుటుంబంతోనే సమయం గడపాలి. మీకు ఇష్టమైన పని కోసం రోజులో కొంత సమయం కేటాయించుకోవాలి. పెయింటింగ్ వేయడం, సంగీతం వినడం, ఆటలు ఆడటం.. మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇక పని ప్రదేశంలో ఒత్తిడిని అధిగమించడానికి.. మీ బాస్‌తో మాట్లాడండి. మీపై పెడుతున్న పనిభారం గురించి వివరించండి.
చివరగా, క్వైట్ బర్నౌట్ అనేది.. మీ శరీరం, మీ మనసు మీకిచ్చే ఓ వార్నింగ్ లాంటిది. పని అంటే.. జీవితంలో ఒక భాగం మాత్రమే! అదే జీవితం కాకూడదని చెప్పే హెచ్చరిక కూడా!