Gold Price | పసిడి ధరలు మగువలకు షాక్ ఇచ్చాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ మధ్య బుధవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం రూ.1,910 పెరిగి తులం రూ.98,450కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.96,540 వద్ద ఉన్నది. ఇక 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.1,870 పెరిగి రూ.98వేలకు ఎగిసింది. డాలర్ బలహీనపడడంతో బంగారం ధరలు పెరిగాయని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా అన్నారు. మూడీస్ యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించిన నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల కోసం చూస్తున్నారన్నారు.
మరో వైపు వెండి ధర సైతం భారీగానే పెరిగింది. రూ.1,660 పెరిగి కిలో ధర రూ.99,160కి చేరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక ఆందోళనల మధ్య బుధవారం బంగారం 3,300 స్థాయికి పడిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లో కమోడిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానంపై కొనసాగుతున్న అనిశ్చితి దీనికి ప్రధాన కారణమని గాంధీ అన్నారు. పెట్టుబడిదారుల్లో భయాందోళనలను పెంచుతోందన్నారు. విదేశీ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్సుకు 21.79 డాలర్లు పెరిగి.. 3,311.76 డాలర్లకు చేరింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందనే నివేదికల మధ్య.. తర్వాత పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు పెరిగాయన్న బంగారం ధరలను పెంచాయని కోటక్ సెక్యూరిటీస్‌లోని ఏవీపీ కమోడిటీ రీసెర్చ్ కైనత్ చైన్వాలా తెలిపారు.