T20 World Cup 2024 : ఐసీసీ ఈవెంట్ ఏదైనా.. వేదిక ఎక్కడైనా సరే.. భారత్(Team India), పాకిస్థాన్ (Pakistan)ల మ్యాచ్‌కు ఉండే క్రేజ్ వేరు. ప్రపంచ క్రికెట్లోనే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా పేరొందిన ఇండో – పాక్ పోరుకు టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) వేదిక కానుంది. జూన్ 9న న్యూయార్క్ గడ్డపై జరిగే చిరకాల ప్రత్యర్థులు ‘నువ్వా నేనా’ అన్నట్టు ఢీ కొననున్నాయి. నిరుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) తర్వాత దాయాది జట్లు తొలిసారి విశ్వ వేదికపై తలపడుతున్న ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
అయితే.. ఈ మెగా టోర్నీలో భారత్, పాక్‌లు మరోసారి ఎదురుపడే చాన్స్ లేకపోలేదు. అలా జరగాలంటే సూపర్ 8 (Super 8)దశకు వచ్చే సరికి పాయింట్ల పట్టికలో ఇరుజట్లు తొలి రెండు స్థానాల్లో నిలవాలి. అప్పుడే టీమిండియా, పాక్ జట్ల మధ్య డబుల్ ఫైట్ చూడగలం. గ్రూప్ ఏలో ఉన్న రోహిత్ శర్మ బృందం బాబార్ ఆజాం సేనకు చెక్ పెడుతుందా? అనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.
వరల్డ్ కప్ వంటి ఐసీసీ మెగా టోర్నీలో పాక్‌పై టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. సచిన్ టెండూల్కర్ (Sachi Tendulkar), గంగూలీ(Ganguly) రోజుల నుంచి దాయాదిని ఓడించడం క్రతువుగా మారింది. ఆ దిగ్గజాలు రిటైరైనా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ద్వయం సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పాక్‌ను చిత్తు చేస్తూ వస్తోందది. రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. ఒకదశలో ఓటమి అంచున నిలిచిన జట్టును రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(82 నాటౌట్) అర్ధ సెంచరీతో గెలిపించాడు.
పాక్‌పై కోహ్లీ(82 నాటౌట్) విజయ గర్జన
హ్యారిస్ రవుఫ్ వేసిన 19వ ఓవర్లో ఆఖరి రెండు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. మరో రెండు రోజుల్లో మొదలయ్యే టీ20 వరల్డ్ కప్‌లోనూ పాక్‌పై విజయాల రికార్డు కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే.. జూన్ 9న ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు నేపథ్యంలో నిర్వాహకులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.