IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పదిహేడో సీజన్ ముగియడంతో అన్ని ఫ్రాంచైజీలు మెగా వేలం (Mega Auction)పై దృష్టి పెట్టాయి. ప్రతి మూడేండ్లకు ఓసారి జరిగే మెగా ఆక్షన్ 2025లో జరుగనుంది. దాంతో, ఎవరిని వదిలేయాలి? ఎవరెవరిని అట్టిపెట్టుకోవాలి? అనే దానిపై ఫ్రాంచైజీలు భారీ కసరత్తులు చేస్తున్నాయి. అంతేకాదు రాబోయే వేలంలో 3 + 1 నియమాన్ని ఎత్తేస్తారా? ఉంచుతారా? అనే విషయమై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే.. బీసీసీఐ(BCCI) మాత్రం ఈ రూల్‌ను అలానే కొనసాగించాలని భావిస్తోందని సమాచారం.
3 ప్లస్ 1 నియమం ప్రకారం ప్రస్తుతం ఉన్న స్క్వాడ్‌లోని కనీసం ముగ్గురు ఆటగాళ్లను ప్రతి ఫ్రాంచైజీ అట్టిపెట్టుకోవచ్చు. ‘రైట్ టు మ్యాచ్’ (Right To Match)పద్ధతిన మరొక ఆటగాడిని రిటైన్ చేసుకోవచ్చు. అందుకోసం ఇతర ఫ్రాంచైజీలు అతడి కోసం వేసిన అత్యధిక బిడ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మెగా వేలంలో అన్ని జట్లు కనీసం ఆరుగురు నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకునే చాన్స్ ఉందని ఐపీఎల్ పాలకమండలిలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అయితే.. రిటెన్షన్ రూల్ (Retension Rule) కొనసాగింపుపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంప్యాక్ట్ ప్లేయర్'(Impact Player) నిబంధనను ఉంచుతారా? రద్దు చేస్తారా? అనే అంశంపై కూడా జై షా బృందం తమ అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించనుంది.
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మహిళా ఆక్షనీర్ వేలం ప్రక్రియను నిర్వహించారు. 17వ సీజన్ మినీ వేలాన్ని మల్లికా సాగర్(Mallika Sagar) సజావుగా నడిపి అందరి ప్రశంసలు అందుకున్నారు. దాంతో, 2025లో జరిగే మెగా ఆక్షన్ బాధ్యతను ఆమెకే అప్పగిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. పదిహేడో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) చాంపియన్‌గా నిలిచింది. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను చిత్తు చేసి మూడో టైటిల్ సొంతం చేసుకుంది.