బెంగళూరు: ఒక వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. భోజనం పెట్టేందుకు నిరాకరించిన భార్య తల నరికి చంపాడు. ఆపై చర్మం కోసి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. (Man Beheads Wife) కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. హులియూరుదుర్గ గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న శివరామ్‌కు పదేళ్ల కిందట పుష్పతో పెళ్లైంది. అతడు రంపం మిల్లులో పని చేయడంపై భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి.
కాగా, సోమవారం రాత్రి శివరామ్ మిల్లు నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అతడి ఉద్యోగం విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది తీవ్రం కావడంతో భర్తకు భోజనం పెట్టేందుకు భార్య పుష్ప నిరాకరించింది. ఆగ్రహించిన శివరామ్ కత్తితో పొడిచి 35 ఏళ్ల భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె తల నరికాడు. రాత్రంతా చర్మాన్ని తొలగించి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు.
మరోవైపు శివరామ్ మంగళవారం ఉదయం తన భార్యను చంపిన విషయాన్ని ఇంటి యజమానికి చెప్పాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వంట గదిలో బీభత్సంగా ఉన్న పుష్ప మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివరామ్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు ఇంట్లో నిద్రపోతుండటాన్ని పోలీసులు గమనించారు.