IND vs NZ | 409/8, 373/7, 390/5, 349/5, 385/9.. మొదట బ్యాటింగ్ చేసిన గత ఐదు వన్డేల్లో టీమ్ఇండియా చేసిన స్కోర్లివి. స్వల్ప వ్యవధిలో నాలుగుసార్లు 350 పరుగుల మార్క్ దాటిన భారత్.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక (30) సార్లు ఈ ఫీట్ నమోదు చేసిన టీమ్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ ఏడాది చివర్లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇది భారత జట్టుకు కలిసి రానుంది. టెస్టు ఫార్మాట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోని ఇంగ్లండ్ జట్టు కూడా ఇలాంటి విధ్వంసక ఆటతీరుతోనే 50 ఓవర్ల ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ (2019)గా ఎదిగింది. అదే దిశగా అడుగులు వేస్తున్న రోహిత్ సేన కూడా ‘బజ్ బాల్’ ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నది!
ఇండోర్: దూకుడే పరమావధిగా దూసుకెళ్తున్న టీమ్ఇండియా.. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో కొండంత స్కోరు చేసింది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన.. మూడో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని మట్టికరిపించి క్లీన్‌స్వీప్ చేసేంత స్కోరు బోర్డు మీదుంచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, ఒక సిక్సర్) పర్వాలేదనిపించాడు. చివర్లో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేయగలిగింది. వన్డే క్రికెట్‌కు ఆదరణ తగ్గుతున్నదనే అభిప్రాయాల నడుమ భారత జట్టు పదే పదే 50 ఓవర్ల క్రికెట్లోని అసలు సిసలు మజాను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నది.
వేగవంతమైన ఔట్ ఫీల్డ్, చిన్న బౌండ్రీ ఉన్న ఇండోర్ స్టేడియంలో టీమ్ఇండియా పరుగుల వరద పారించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రోహిత్, గిల్ దంచి కొట్టడంతో టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించడం పెద్ద తప్పైందని న్యూజిలాండ్ సారథి టామ్ లాథమ్ తప్పక భావించే ఉంటాడు. ఓపెనర్లు మంచినీళ్ల ప్రాయంలో బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగాన్ని తలపించింది. ఈ క్రమంలో 33 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకోగా.. కాసేపటికే రోహిత్ శర్మ (41 బంతుల్లో) ఆ మార్క్ అందుకున్నాడు. అప్పటికే మైదానం నలువైపులా బౌండ్రీలతో హోరెత్తించిన ఈ జోడీ.. ఆ తర్వాత కివీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఎడాపెడా భారీ షాట్లు ఆడిన వీరిద్దరూ ఒకే ఓవర్లో సెంచరీ మార్క్ అందుకున్నారు. దీంతో భారత జట్టు 26 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 212 పరుగులతో నిలిచింది. ఇంకేముంది 400 పరుగుల మార్క్ దాటడం పెద్ద కష్టం కాదని అభిమానులంతా ఆశించారు. కోహ్లీ, ఇషాన్, సూర్య, పాండ్యా బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో భారత్ వన్డే క్రీకెట్లో తమ అత్యధిక (418/5) స్కోరును దటడం పక్కా అనిపించింది. అయితే ఈ దశలో తిరిగి పుంజుకున్న న్యూజిలాండ్ బౌలర్లు భారత్‌ను కట్టడి చేశారు. చివర్లో హార్దిక్, శార్దూల్ విలువైన పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరే చేసింది. వన్డే క్రికెట్లో భారత్‌కిది 12వ అత్యధిక స్కోరు.
గతేడాది చివర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. చటోగ్రామ్ వేదికగా జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. యంగ్ గన్ ఇషాన్ కిషన్ (131 బంతుల్లో 210; 24 ఫోర్లు, 10 సిక్సర్లు) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ (91 బంతుల్లో 113; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్ 227 పరుగుల తేడాతో గెలుపొంది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన పోరులో విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. ఈ నెల 10న గువాహటి వేదికగా జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 రన్స్ చేసింది. కోహ్లీ (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, 1 సిక్సరర్) సెంచరీ నమోదు చేయగా.. రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) రాణించారు. అనంతరం చేజింగ్‌లో లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసింది. దీంతో రోహిత్ సేన 67 పరుగుల తేడాతో గెలుపొందింది.
అప్పటికే లంకపై సిరీస్ నెగ్గిన భారత్ తిరువనంతపురంలో ఈ నెల 15న జరిగిన పోరులో ప్రపంచ రికార్డు విజయం ఖాతాలో వేసుకుంది. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ (110 బంతుల్లో 166 నాటౌట్; 13 ఫోర్లు, 8 సిక్సర్లు), గిల్ (116) సెంచరీలు నమోదు చేయడంతో రోహిత్ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 390 రన్స్ చేసింది. అనంతరం లంక 73 పరుగులకే చాపచుట్టేయడంతో టీమ్ఇండియా 317 పరుగుల తేడాతో గెలుపొందింది. పరుగుల పరంగా వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం.
ఇక గత వారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను భారత అభిమానులు ఇప్పట్లో మరవలేరనే చెప్పాలి. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించని చోట.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. అతడి జోరుతో రోహిత్‌సేన 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. అనంతరం బ్రాస్‌వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) రాణించడంతో న్యూజిలాండ్ పోటీనివ్వగలిగింది. అయితే వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన టీమ్ఇండియా చివరకు 49.2 ఓవర్లలో 337 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసింది. లోకల్ బాయ్ మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో విజృంభించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
*డిసెంబర్ 10 చటోగ్రామ్ బంగ్లాదేశ్‌పై 409/8
*జనవరి 15 తిరువనంతపురం శ్రీలంకపై 390/5
*జనవరి 10 గువాహటి శ్రీలంకపై 373/7
*జనవరి 18 హైదరాబాద్ న్యూజిలాండ్‌పై 349/8
*జనవరి 24 ఇండోర్ న్యూజిలాండ్‌పై 385/9
IND vs NZ | మూడో వన్డేలో కివీస్‌ను చిత్తు చేసిన భారత్.. 3-0తో సిరీస్ కైవసం
– నమస్తే తెలంగాణ క్రీడా విభాగం