ICC : క్రికెట్లో బౌండరీ లైన్ వద్ద గాల్లోకి జంప్ చేస్తూ క్యాచ్‌లు పడుతుంటారు ఫీల్డర్లు కొందరు. అలాంటి కళ్లు చెదిరే క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. నిరుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సైతం బౌండరీ లైన్ వద్ద అద్బుతమైన క్యాచ్‌తో మిల్లర్‌ను వెనక్కి పంపాడు. అయితే.. ఇవి ఒక్కోసారి వివాదాస్పదం అవుతుంటాయి. కాబట్టి ఇకపై ఇలాంటి విన్యాసాలకు ఐసీసీ చెక్ పెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బౌండరీ గీత దాటి.. మళ్లీ బయటకు వచ్చి పట్టిన క్యాచ్‌లపై కీలక నిర్ణయం తీసుకోనుంది ఐసీసీ.
బౌండరీ లైన్ వద్ద వివాదాస్పందంగా నిలిచే క్యాచ్‌లపై ఐసీసీ మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ విషయమై మేరిలొబొన్ క్రికెట్ క్లబ్(ఎసీజీ)కి ఐసీసీ లేఖ రాసింది. అందులో బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి జంప్ చేసి పట్టే క్యాచ్‌లను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావాలని ఐసీసీ భావిస్తోంది.
ఫీల్డర్ బంతి అందుకున్నాక అతడు లేదా ఆమె మైదానంలోనే ఉండి క్యాచ్ పూర్తి చేయాలి. అంతేతప్ప బౌండరీ లైన్ దాటకూడదని ఐసీసీ నిబంధన 19.5.1 చెబుతుంది.
బంతి గాల్లో ఉన్నప్పుడు దానిని పట్టుకున్న ఫీల్డర్.. క్యాచ్‌ను పూర్తి చేయడానికి ముందు కూడా మైదానంలోనే ఉండాలి. అంతే తప్ప లైన్ దాటి బయటకు వెళ్లకూడదు. అంటే.. ఫీల్డర్ క్యాచ్ కోసం బౌండరీకి అవతల ఎదురుచూడకూడదు.
ఒక్కోసారి ఇద్దరు ఫీల్డర్లు క్యాచ్ పడుతుంటారు. అలాంటప్పుడు మొదట పేర్కొన్న రెండు విషయాలు ఈ క్యాచ్‌కు వర్తిస్తాయి. అంటే.. బంతిని పట్టుకునే సమయానికి ఇద్దరూ కూడా మైదానంలోనే ఉండాలి. గీత దాటకుండానే క్యాచ్ పూర్తి చేయాలి.
కొన్నసార్లు ఫీల్డర్లు బంతిని గాల్లోనే ఆపి బౌండరీని అడ్డుకుంటారు. అయితే.. బంతిని బయటకు విసిరేసిన తర్వాత వాళ్లు బౌండరీ లైన్‌కు లోపలే ఉండాలి. అలా లేకుంటే దాన్ని బౌండరీగా పరిగణిస్తారు.