ICC : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితికి ఇంకా తెరపడలేదు. పాకిస్థాన్ వేదికగానే టోర్నీ జరుగుతుందా? లేదా బీసీసీఐ పట్టుపడుతున్నట్టు హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో నిర్వహిస్తారా? అనేది తెలియడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుందనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ ప్రకటించకుండానే చాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ టూర్‌ను ప్రారంభించింది.
వరల్డ్ టూర్లో భాగంగా ఐసీసీ ట్రోఫీని మొదటగా పాకిస్థాన్‌కు పంపింది. గురువారం ఇస్లామాబాద్‌కు చాంపియన్స్ ట్రోఫీ చేరుకుంది. ఒక వారం రోజులు అంటే నవంబర్ 16 నుంచి 24 వరకూ పాక్‌లోని ప్రసిద్ధ నగరాల్లో పీసీబీ ఆ ట్రోఫీని ప్రదర్శించనుంది. అంతేకాదు పాక్ భూభాగంలోని కారాకోరం శ్రేణి పర్వతాలపై కూడా ట్రోఫీని ఉంచి.. ప్రచారం కల్పించే ఆలోచనల్లో పీసీబీ ఉంది. ఆ తర్వాత భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక.. ఇతర దేశాల్లో కూడా చాంపియన్స్ ట్రోఫీ టూర్ కొనసాగనుంది.
ఒకవేళ హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించకుంటే దక్షిణాఫ్రికాలో టోర్నీని జరిపేందుకు ఐసీసీ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎటు చూసినా పాక్ బోర్డుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. చాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యం హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్ ఆ దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ టోర్నీని సజావుగా నిర్వహించడం కోసం ఐసీసీ ఆ దేశ బోర్డుకు రూ.548 కోట్లు కేటాయించింది.
ఇప్పుడు పీసీబీ ముందున్న దారి ఒక్కటే. అంతర్జాతీయ క్రికెట్ మండలి సూచించినట్టు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాలి. అప్పుడు భారత జట్టు మ్యాచ్‌లు తటస్థ వేదికైన యూఏఈలో జరుగుతాయి. అలా కాదని పీసీబీ మొండికేస్తే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ సిద్దంగా ఉంది. అదే జరిగితే మెగా టోర్నీ ఆతిథ్యం కింద పీసీబీకి ఐసీసీ కేటాయించిన రూ.548 కోట్లు హుష్‌కాకి అయినట్టే.