ICC : వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)భారీ బడ్జెట్ ప్రకటించింది. మెగా టోర్నీ నిర్వహించేందుకు ఏకంగా రూ.500 కోట్ల( 70 మిలియన్ల డాలర్లు)ను కేటాయించింది. చాంపియన్స్ ట్రోఫీ 9 వ సీజన్ నిర్వహణకు రూ. 500 కోట్లు అవసరమవుతాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఐసీసీ ఓ ప్రతిపాదన సిద్ధం చేశాయి.
ఐసీసీ, పీసీబీ సంయుక్తంగా చేసిన ప్రతిపాదనపై బీసీసీఐ సెక్రటరీ జై షా (Jai Shah) నేతృత్వంలోని ఫైనాన్షియల్, కమర్షియల్ డీలింగ్స్ కమిటీ అధ్యయనం చేసి ‘ఓకే’ చెప్పింది. దాంతో, శుక్రవారం ఐసీసీ ఈ మెగా టోర్నీ కోసం భారీ మొత్తాన్ని కేటాయిస్తున్నట్టు చెప్పింది.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇప్పటికే పీసీబీ మెగా టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీకి పంపింది. భారత జట్టు మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహిస్తున్నట్టు తమ రిపోర్టులో విన్నవించింది. అయితే.. పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ ట్రోఫీలో టీమిండియా ఆడడంపై అనిశ్చితి నెలకొంది. భద్రత కారణాల రీత్యా భారత జట్టును పాకిస్థాన్‌కు పంపబోమని బీసీసీఐ (BCCI) తెగేసి చెప్పడమే అందుకు కారణం.
దాంతో, పాక్ గడ్డపై కాకుండా దుబాయ్‌లో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ భారత జట్టు ఈ మెగా టోర్నీలో ఆడకుంటే టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026 ) నుంచి వైదొలగాలని పీసీబీ భావిస్తోంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీని బాయ్‌కాట్ చేయాలని పాక్ బోర్డు అనుకుంటోంది. చాంపియన్స్ ట్రోఫీకి ఇప్పటివరకూ 8 జట్లు అర్హత సాధించాయి. నిరుడు వన్డే వరల్డ్ కప్ ప్రదర్శన ఆధారంగా భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లు జట్లు నేరుగా క్వాలిఫై అయ్యాయి.