Andy Murray : మాజీ వరల్డ్ నంబర్ 1 ఆండీ ముర్రే (Andy Murray) టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. ఇదే తన చివరి ఒలింపిక్స్ అని చెప్పిన ఈ దిగ్గజ ఆటగాడు ఓటమితో కెరీర్‌ను ముగించాడు. విశ్వక్రీడల్లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైన ముర్రే తనకెంతో ఇష్టమైన ఆటకు గుడ్ బై చెప్పేశాడు. క్వార్టర్స్‌లో ముర్రే, డానియల్ ఎవాన్స్ జోడీ చేతిలో ఓడింది. దాంతో, పతకంతో కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న బ్రిటన్ స్టార్‌కు నిరాశే మిగిలింది.
ప్రపంచ టెన్నిస్‌లో బ్రిటన్ పేరు వినిపించేలా చేసిన ముర్రే తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ వంటి దిగ్గజాలకు చెక్ పెట్టి 2016 నవంబర్‌లో నంబర్ 1 ర్యాంక్ సాధించాడు. అయితే.. గత కొన్నాళ్లుగా గాయాలతో సతమతమవుతున్న ముర్రే వింబుల్డన్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా ఒలింపిక్స్‌తో అంతర్జాతీయ టెన్నిస్‌కు బైబై చెప్పేశాడు. ఒలింపిక్స్‌లో చివరి మ్యాచ్ ఆడేసిన ముర్రే.. ఇకపై టెన్నిస్‌ను ఏ రకంగానూ ఇష్టపడను అంటూ జోక్ చేశాడు.
ఒలింపిక్స్‌లో ముర్రేకు గొప్ప రికార్డు ఉంది. 2012లో జరిగిన విశ్వ క్రీడల్లో బ్రిటన్ స్టార్ స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించాడు. అదే టోర్నీలో మిక్స్డ్ డబుల్స్‌లో ముర్రే వెండి పతకం కొల్లగొట్టాడు. డిఫెండింగ్ చాంపియన్ ట్యాగ్‌ను నిలబెట్టుకుంటూ ఈ స్టార్ ఆటగాడు 2016లో మరోసారి గోల్డ్ మెడల్‌తో మెరిశాడు.
మాజీ వరల్డ్ నంబర్ 1 అయిన ముర్రే మూడు గ్రాండ్‌స్లామ్స్ గెలుపొందాడు. 2013లో వింబుల్డన్ టైటిల్ కొల్లగొట్టిన ముర్రే.. 2016 వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ట్రోఫీలతో ప్రపంచ టెన్నిస్‌లో రారాజుగా వెలుగొందాడు. అయితే.. 2019లో ముర్రే తొడ భాగానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటినుంచి అతడు తరచూ గాయాలపాలవుతున్నాడు. తాజాగా సోదరుడు జేమీ ముర్రేతో కలిసి డబుల్స్ ఆడిన ఈ సీనియర్ ఆటగాడు వింబుల్డన్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.