న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) స్కామ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్ల విక్రయంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, కార్పొరేట్ సంస్థల మధ్య ‘క్విడ్ ప్రోకో’ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోలు)తోపాటు పలువురు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన డేటా ద్వారా ‘షెల్, లాస్ మేకింగ్ కంపెనీల’ నుంచి రాజకీయ పార్టీలకు నిధులు సమకూరడంపై దర్యాప్తు జరుపాలని కోరాయి. ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాల్లో ‘క్విడ్ ప్రోకో’కు సంబంధించిన ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, కోర్టు పర్యవేక్షణలో సిట్‌తో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించాయి.
కాగా, సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను శుక్రవారం పరిశీలించింది. చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాల ఆధారంగా దీనిపై అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దశలో ఈ అంశంపై కోర్టు జోక్యం చేసుకోవడం తగదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్‌పై కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఫిబ్రవరి 15న ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. రాజకీయ పార్టీలు వెల్లడించని నిధులు ఓటర్ల పారదర్శకత హక్కును ఉల్లంఘించినట్లుగా సుప్రీంకోర్టు పేర్కొంది.