Rajya Sabha MP : ఢిల్లీలోని ఆశా కిరణ్ షెల్టర్ హోంలో వెలుగుచూసిన మరణాలపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ స్పందించారు. గత 20 రోజులుగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశా కిరణ్ షెల్టర్ హోంలో 13 మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మరణాలకు కారణాలేంటనేది ఇప్పటివరకూ బయటపడలేదని అన్నారు. తాను ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్గా ఉన్న సమయంలో అక్కడి పరిస్ధితిని తనిఖీ చేశానని చెప్పారు. అక్కడి పరిస్ధితి ఏమీ బాగా లేదని, సరైన సిబ్బంది లేరని, వైద్యులు అందుబాటులో ఉండరని తెలిపారు.
అప్పట్లో తాము దీనిపై నివేదిక రూపొందించి ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని, దీనిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తాను పార్లమెంట్లో లేవనెత్తుతానని స్వాతి మలివాల్ స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీలోని ఆశా కిరణ్ షెల్టర్ హోం మరణాలపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఢిల్లీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో శ్వాస తీసుకోవడం కష్టం..అలాగే వార్తలు చదవడం కూడా మింగుడు పడని అంశమేనని అన్నారు. ఆశాకిరణ్ షెల్టర్ హోంలో మానసిక వికలాంగులు ఉంటారని, అక్కడి చిన్నారులకు సరైన ఆహారం అందించడం లేదని, అస్వస్ధతకు గురైన వారికి వైద్య చికిత్సలు అందించడం లేదని చెప్పారు. ఆప్ సర్కార్ అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని, ఇలాంటి వార్తలు ప్రతిరోజూ వెలుగుచూస్తున్నాయని అన్నారు. ఈ ఘటనలపై ఆప్ ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీని ఆప్ సర్కార్ విచారకర పరిస్ధితికి తీసుకువచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీని కాపాడుకోవాలంటే ఇలాంటి వారిని అధికారం నుంచి సాగనంపాలని మనోజ్ తివారీ పేర్కొన్నారు.
Read More :