Formula E Race | ప్రతిష్టాత్మక పోటీలకు హైదరాబాద్ ( Hyderabad ) మహానగరం సిద్ధమైంది. ఫార్ములా ఈ రేసుకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. ఫిబ్రవరిలో జరిగే ఈ పోటీల కోసం ఇప్పట్నుంచే ముస్తాబవుతోంది. దేశంలోనే తొలిసారిగా నగరంలో నిర్వహిస్తున్న ఈ రేసు కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఫార్ములా ఈ కార్లు దూసుకెళ్లేందుకు వీలుగా ట్రాక్‌లను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇండియన్ రేసింగ్ లీగ్ ( Indian Racing League )లో భాగంగా వీటిని పరీక్షించేందుకు ఈ నెల 19, 20 వ తేదీల్లో అలాగే డిసెంబర్ 10, 11వ తేదీల్లో ట్రయల్స్ నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఫార్ములా ఈ పోటీలు ఎలా జరుగుతాయి? వాటి విజేతలను ఎలా నిర్ణయిస్తారు? ఎలాంటి కార్లను వాడుతారు? వంటి వివరాలను ఒకసారి చూద్దాం..
ఫార్ములావన్ రేసుతో పోలిస్తే ఫార్ములా ఈ రేసులో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఫార్ములా వన్ రేసులో వాడే కార్లు అంతర్గత దహన ప్రక్రియతో నడిచే ఇంజిన్లు వాడతారు. వీటికోసం శిలాజ ఇంధనాలను వినియోగిస్తారు. అదే ఫార్ములా ఈ రేసులో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వాడతారు. కాబట్టి వీటికి ప్రత్యేకమైన రేసింగ్ ట్రాక్స్ అవసరం లేదు. రెగ్యులర్‌గా మనం వాడే రోడ్లు సరిపోతాయి.
ఫార్ములా ఈ రేసులో మొత్తం 11 జట్లు పాల్గొంటాయి. ఒక్కో జట్టులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. అయితే ఈ 11 జట్లలో తయారీదారులు, వినియోగదారులకు సంబంధించిన టీమ్‌లు ఉంటాయి.
పాల్గొనే జట్లు :
మ్యాన్యుఫ్యాక్షరింగ్ టీమ్ : జాగ్వార్, మహీంద్రా, మసేరటి, నియో 333, ఫోర్సే ఏజీ, నిసాన్, డీఎస్ ఆటోమొబైల్స్
కస్టమర్ టీమ్స్ : అవలాంచె ఆండ్రెట్టి ఫార్ములా ఈ, ఎన్విజన్ రేసింగ్, ఎంసీ లారెన్, ఏబీటీ స్పోర్ట్స్‌లైన్
ఫార్ములావన్ రేసులో నిర్ణీత ల్యాప్స్‌ను పూర్తిచేసేందుకు డ్రైవర్లు పోటీ పడతారు. అయితే ఫార్ములా ఈ రేసు దీనికి భిన్నంగా ఉంటుంది. ముందుగా 45 నిమిషాల రేసులో పాల్గొనాలి. సమయం పూర్తి కాగానే ఒక ల్యాప్‌ను ముందుగా ఎవరు పూర్తి చేస్తారో వారిని ఫార్ములా ఈ రేసు విన్నర్‌గా ప్రకటిస్తారు.
ఫార్ములా ఈ రేసులో ఒక్కో రౌండ్ గెలిచిన విన్నర్‌కు పాయింట్లు కేటాయిస్తారు. ఎఫ్ఐఏ స్కోరింగ్ సిస్టమ్ ఆధారంగా ఒక్కో రౌండ్లో టాప్ వచ్చిన 10 డ్రైవర్లు ఈ పాయింట్లు కేటాయిస్తారు. రేసులో ఫస్ట్ వచ్చిన డ్రైవర్‌కు 25 పాయింట్లు కేటాయిస్తారు. పదో స్థానంలో వచ్చిన డ్రైవర్‌కు ఒక పాయింట్ కేటాయిస్తారు. రెండో స్థానానికి 18 పాయింట్లు, మూడో స్థానానికి 15 పాయింట్లు, నాలుగో స్థానానికి 12 పాయింట్లు, ఐదో స్థానానికి 10 పాయింట్లు, ఆరో స్థానానికి 8 పాయింట్లు, ఏడో స్థానానికి 6 పాయింట్లు, ఎనిమిదో స్థానానికి 4 పాయింట్లు, తొమ్మిదో స్థానానికి 2 పాయింట్లు కేటాయిస్తారు. ఇలా సీజన్ మొత్తం పూర్తయ్యేసరికి ఎవరు ఎక్కువ పాయింట్లు పొందితే వారినే సీజన్ విన్నర్‌గా ప్రకటిస్తారు.
రౌండ్ 1 మెక్సికో సిటీ ( మెక్సికో) 2023 జనవరి 14
రౌండ్ 2 దిరియా ( సౌదీ అరేబియా ) 2023 జనవరి 27
రౌండ్ 3 దిరియా ( సౌదీ అరేబియా ) 2023 జనవరి 28
రౌండ్ 4 హైదరాబాద్ (భారత్ ) 2023 ఫిబ్రవరి 11
రౌండ్ 5 కేప్ టౌన్ ( దక్షిణాఫ్రికా ) 2023 ఫిబ్రవరి 25
రౌండ్ 6 సావో పాలో ( బ్రెజిల్ ) 2023 మార్చి 25
రౌండ్ 7 బెర్లిన్ ( జర్మనీ ) 2023 ఏప్రిల్ 22
రౌండ్ 8 బెర్లిన్ ( జర్మనీ ) 2023 ఏప్రిల్ 23
రౌండ్ 9 మొనాకో 2023 మే 6
రౌండ్ 10 ఇంకా నిర్ణయించలేదు 2023 మే 20
రౌండ్ 11 జకర్తా ( ఇండోనేసియా ) 2023 జూన్ 4
రౌండ్ 12 జకర్తా ( ఇండోనేసియా ) 2023 జూన్ 4
రౌండ్ 13 ఇంకా నిర్ణయించలేదు 2023 జూన్ 24
రౌండ్ 14 రోమ్ ( ఇటలీ ) 2023 జూలై 16
రౌండ్ 15 రోమ్ ( ఇటలీ ) 2023 జూలై 16
రౌండ్ 16 లండన్ ( ఇంగ్లండ్ ) 2023 జూలై 29
రౌండ్ 17 లండన్ ( ఇంగ్లండ్ ) 2023 జూలై 30
ఫార్ములా ఈ రేసులో ఇప్పటివరకు నిర్వహించిన 8 సీజన్లలో రెండు జనరేషన్ ఎలక్ట్రిక్ కార్లను వాడారు. ఇప్పుడు తొమ్మిదో సీజన్లో మూడో జనరేషన్ కార్లను వాడబోతున్నారు. 2023 జనవరి 14న మెక్సికోలో జరిగే ఫస్ట్ రౌండ్‌తో ఈ కార్లు తొలిసారిగా ట్రాక్ మీదకు రాబోతున్నాయి.
జెన్ 1 కార్లు
మొదటి నాలుగు సీజన్లలో ఈ కార్లను ఉపయోగించారు. వీటికి 150kW ఎనర్జీ అవసరం అవుతుంది. ఈ కారు కేవలం మూడు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
జెన్ 2 కార్లు
2018-19లో నిర్వహించిన ఐదో సీజన్ నుంచి జెన్ 2 కార్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 250 kW బ్యాటరీలను ఉపయోగించారు. ఇవి గరిష్ఠంగా గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ కార్లు 2.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి.
జెన్ 3 కార్లు
మొదటి రెండు జనరేషన్ కార్లతో పోలిస్తే థర్డ్ జనరేషన్ కార్లు చాలా మెరుగ్గా పనిచేస్తాయి. ఇవి గంటకు 322 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. వీటి టైర్లను కూడా సహజ స్థిరమైన మెటీరియల్‌తో తయారు చేశారు. రీసైకిల్డ్ ఫైబర్‌ను వాడటం వల్ల ఎలాంటి వాతావరణంలో అయినా వీటి గ్రిప్ దృఢంగా ఉంటుంది.
స్పీడ్ 300 KM/H.. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్