IPL 2025 : టీ20ల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేందుకు ఒక్క ఓవర్ చాలు. అందుకే ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసేందుకు ఒక బౌలర్‌ను టార్గెట్ చేస్తుంటారు బ్యాటర్లు. అయితే.. నో బాల్స్(No ball) కూడా మ్యాచ్‌ను శాసిస్తున్నాయి. అవును.. ఐపీఎల్ 18వ సీజన్లో బౌలర్లు చేసే పొరపాటుకు బౌలింగ్ జట్లు పెద్ద మూల్యమే చెల్లిస్తున్నాయి. లైఫ్ లభించడంతో హిట్టర్లు రెచ్చిపోతున్నారు. ఇదే అదనుగా చెలరేగి ఆడుతూ భారీ స్కోర్లు సాధిస్తున్నారు. అందుకు ఉప్పల్ స్టేడియంలో మెరుపు సెంచరీ బాదిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) తాజా ఉదాహారణ.
ఈ ఎడిషన్‌లో ఒక మ్యాచ్‌లో కనీసం ఒక నో బాల్ కచ్చితంగా నమోదు అవుతోంది. ఆ బంతి ప్రమాదకరమైన బ్యాటర్ల పాలిట వరంలా మారుతోంది. ఏప్రిల్ 12న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పేసర్ యశ్ ఠాకూర్ (Yash Thakur) బౌలింగ్‌లో అభిషేక్ శర్మ ఔటయ్యాడు. అప్పటికీ అతడు 35 పరుగుల వద్ద ఉన్నాడు. కానీ, అది నో బాల్ కావడంతో బతికిపోయిన అభిషేక్ విధ్వంసక శతకం సాధించాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ టోర్నీలోనే రికార్డు స్కోర్ కొట్టాడు.
🧡
Abhishek Sharma | #PlayWithFire | #SRHvPBKS | #TATAIPL2025 pic.twitter.com/OaD4YQEmTT
— SunRisers Hyderabad (@SunRisers) April 12, 2025
ఇక వాంఖడేలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రియాన్ రికెల్టన్(Ryan Rickelton)కు సైతం నో బాల్‌తో లైఫ్ లభించింది. సన్‌రైజర్స్ లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో రికెల్టన్ పెద్ద షాట్ ఆడి కమిన్స్ చేతికి చిక్కాడు. కానీ, వికెట్ కీపర్ క్లాసెన్ గ్లోవ్స్ వికెట్ల ముందుకు రావడంతో అంపైర్ ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. దాంతో, మైదానం వీడిన ముంబై ఓపెనర్ తిరిగి క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత రెండు ఫోర్లు బాదిన అతడు 31 రన్స్‌తో
ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఒక బంతిని నో బాల్‌గా ప్రకటిచేందుకు అంపైర్లు పలు విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటారు. అవేంటంటే.. బౌలర్ పాదం నాన్ -స్ట్రయికర్ క్రీజు బయట పెట్టి బంతి విసిరితే దాన్ని నో బాల్ అవుతుంది. అలాగే బ్యాక్‌ఫుట్ అంటే బౌలర్ రెండో పాదం వికెట్ల వెనకాల ఉన్నా సరే అది లీగల్ డెలివరీ కాదు. అంతేకాదు బౌలింగ్ చేసే విధానం కూడా ముఖ్యమే.
బంతిని బ్యాటర్‌పైకి విసరడం లేదా బౌలింగ్ బదులు త్రో చేయడం కూడా నో బాల్ కిందే లెక్క. అంపైర్‌కు చెప్పకుండా బౌలింగ్ యాక్షన్ మార్చి బంతిని విసిరితే .. దాన్ని నో బాల్ అంటారు. ఇక ఫుల్‌టాస్ వేసినా, బంతి ఒకటి కంటే ఎక్కువసార్లు బౌన్స్ అయినా.. అది నో బాల్ అన్నట్టే. పిచ్‌కు అవతల పడినా కూడా నో బాల్‌గా లెక్కిస్తారు. బౌలింగ్ చేసే సమయంలో బౌలర్ చేయి వికెట్లకు తాకినా, బంతి క్రీజు వరకూ వెళ్లకున్నా.. ఫీల్డింగ్ పొరపాట్లు.. బంతి వేయడానికి ముందే వికెట్ కీపర్ గ్లోవ్స్ వికెట్ల ముందుకు వచ్చినా అంపైర్లు నో బాల్ అనేస్తున్నారు.