IND vs BAN : మూడు రోజులైతే సొంతగడ్డపై బంగ్లాదేశ్(Bangladesh)తో రెండు టెస్టుల సిరీస్. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు చెపాక్ స్టేడియంలో నెట్స్ ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. తొలి టెస్టు ఏర్పాట్లలో తలమునకలై ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి అంతలోనే ఊహించని షాక్. బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లోని హిందువులపై దాడులు ఆగేంత వరకూ ఆ దేశంతో సిరీస్ ఆడొద్దని హిందూ జనజాగృతి సమితి(Hindu Janajagruti Samiti) సభ్యులు పట్టుబట్టారు. అంతేకాదు వాంఖడే స్టేడియం అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
నెల క్రితం బంగ్లాదేశ్‌లో ఎంతో మంది హిందువులపై హత్యాకాండకు నిరసనగా ఈ డిమాండ్ చేసినట్టు హిందూ జనజాగృతి సభ్యులు తెలిపారు. ముంబైలోని వాంఖడే స్టేడియానికి సోమవారం హిందూ జనజాగృతి సమితి సభ్యులు వచ్చారు. బంగ్లాదేశ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌లు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.
‘బంగ్లాదేశ్‌లో మైనార్టీలలైన హిందువులను అక్కడి జిహాదీలు నడిరోడ్డు మీదే చంపేస్తున్నారు. హిందువుల ఇండ్లను తగులబెడుతున్నారు. అంతేకాదు గుళ్లను ధ్వంసం చేస్తున్నారు. హిందూ మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జట్టుతో క్రికెట్ ఎలా ఆడుతాం?’ అని హిందూ జనజాగృతి సమితి సభ్యులు వాంఖడే అధికారులను ప్రశ్నించారు. అయితే.. బీసీసీఐ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సెప్టెంబర్ 19వ తేదీన తొలి టెస్టు జరుగనుంది.
బంగ్లాదేశ్‌లో హింసాత్మక దృశ్యాలు
రిజర్వేషన్ కోటాకు వ్యతిరేక ఆందోళనలతో నెల క్రితం బంగ్లాదేశ్ అట్టుడుకి పోయింది. అల్లరిమూకలు పెట్రేగిపోయి యథేచ్ఛగా హిందువులతో పాటు ముఖ్యంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా (Sheik Hasina) పార్టీ అవావీ లీగ్(Awami League) మద్ధతుదారులపై దాడులు చేశారు. దొరికినవాళ్లను దొరికనట్టు చంపేశారు. వాళ్ల ఇండ్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ హింసాకాండకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తెరదించింది. అప్పటికే బంగ్లాదేశ్‌లోని మైనార్టీలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.