ఇంఫాల్: విదేశీ తిరుగుబాటుదారుడ్ని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ (Manipur) సీఎం ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు. అస్సాం రైఫిల్స్‌ను ఆయన అభినందించారు. అయితే సీఎం అబద్ధం చెబుతున్నారని కుక్కీ గ్రూప్ ఆరోపించింది. అరెస్ట్ చేసిన వ్యక్తి శరణార్థి అని పేర్కొంది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సోమవారం ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడారు. మయన్మార్‌కు చెందిన తిరుగుబాటు గ్రూపు కుకీ నేషనల్ ఆర్మీ (బర్మా), కేఎన్ఏ(బీ) సభ్యుడైన బర్మా జాతీయుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ‘అస్సాం రైఫిల్స్ కార్యకలాపాలను నేను నిజంగా అభినందిస్తున్నా. మణిపూర్‌లోని ప్రస్తుత సంక్షోభంలో విదేశీ హస్తం ఉంది. ముఖ్యమంత్రిగా మొదటి నుంచి నిరంతరంగా ఈ విషయం చెబుతున్నా. కొంతమంది దానిని నమ్ముతున్నారు. కేఎన్ఏ(బీ) సభ్యుడ్ని పట్టుకున్నందుకు అస్సాం రైఫిల్స్‌ను నేను అభినందిస్తున్నా’ అని అన్నారు.
కాగా, సీఎం ఎన్ బీరెన్ సింగ్ ప్రకటన అబ్ధమని కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (కేఎస్‌వో-జీహెచ్‌క్యూ) ఆరోపించింది. కేఎన్ఏ (బీ) సభ్యుడిగా సీఎం పేర్కొన్న వ్యక్తి మయన్మార్‌లో జరుగుతున్న సంఘర్షణ నుంచి పారిపోయి వచ్చిన రిజిస్టర్డ్ శరణార్థి అని పేర్కొంది. అస్సాం రైఫిల్స్‌కు ఈ విషయం తెలుసని కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తెలిపారు. అయితే అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు ఈ అరెస్ట్ గురించి అధికారికంగా ప్రకటించలేదు.
మరోవైపు మణిపూర్‌లో మెజార్టీ వర్గమైన మైతీలకు రిజర్వేషన్ కల్పించడాన్ని మైనారీలైన కుకీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది మే నుంచి ఈ రెండు జాతుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతి దాడుల్లో వందలాది మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.