Ashwin : ప్రపంచ క్రికెట్లో ‘బెస్ట్ కవర్ డ్రైవ్’ కొట్టేది ఎవరు? ‘ఫుల్ షాట్’ను బాగా ఆడే ఆటగాడు ఎవరు? .. ఈ ప్రశ్నలు పూర్తికాకముందే చాలామంది ఇంకెవరు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)లు అని ఠక్కున చెబుతారు. కానీ, వీళ్లిద్దరి కంటే తోపులు ఉన్నారంటున్నాడు భారత జట్టు సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichanrdran Ashwin). బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో వికెట్ల వేటకు సిద్ధమవుతున్న అతడు ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ కోహ్లీ, రోహిత్‌ల కంటే బాగా సొగసుగా షాట్లు ఆడగల ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు.
యూట్యూబర్ అడిగిన ప్రశ్నలకు ఆశ్విన్ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ‘ప్రపంచలోని క్రికెటర్లలో బెస్ట్ కవర్ డ్రైవ్ ఎవరిది?’ అనే ప్రశ్నకు ‘ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోథిక్’ అని బదులిచ్చాడు. అంతేకాదు ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ కూడా చాలా అందంగా కవర్ డ్రైవ్ ఆడుతాడని అశ్విన్ అన్నాడు.
రోహిత్, పాంటింగ్, ట్రెస్కోథిక్
ఇక ‘ఫుల్‌షాట్ చాలాబాగా ఆడేది ఎవరు?’ అనే ప్రశ్నకు అతడు ఏమాత్రం తడుముకోకుండా ‘ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్’ అని చెప్పేశాడు. ‘ఈ విషయం తెలిస్తే రోహిత్ శర్మ మిమ్మల్ని ఏమైనా అంటాడేమో’ అని యూట్యూబర్ ఆ వెంటనే సందేహం వెలిబుచ్చగా.. ‘అదేం లేదు. నేను అతడితో మాట్లాడుతాను’ అని అశ్విన్ నవ్వుతూ చెప్పాడు.
సొంత మైదానమైన చెపాక్‌లో చెలరేగిపోవాలని భావిస్తున్న అశ్విన్ తన కెరీర్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇంకెన్ని రోజులు క్రికెట్ ఆడుతారు? మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటీ?’ అనే ప్రశ్నలకు అశ్విన్ నిజాయతీగా సమాధానం చెప్పాడు. ‘ఏ రోజు అయితే నాకు మెరుగుపడాలనే ఆలోచన రాదో.. ఆ రోజు ఆటకు వీడ్కోలు పలుకుతా’ అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. 2011 నవంబర్‌లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ మాంత్రికుడు ఇప్పటివరకూ 516 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు బ్యాటుతోనూ ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తూ 5 సెంచరీలు బాదేశాడు.