డెహ్రాడూన్: నదిలో మునిగిపోతున్న తమ్ముడ్ని చూసి అక్కాచెల్లెళ్లు ఆందోళన చెందారు. వెంటనే నదిలోకి దూకి తమ్ముడ్ని ఒడ్డుకు తోసి కాపాడారు. అయితే నదీ ప్రవాహంలో వారిద్దరూ కొట్టుకుపోయారు. (Sisters Swept Away In Ganga) ఈ విషయం తెలిసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం హరిపూర్ కలాన్‌లో గీతా కుటీర్ ఘాట్ వద్ద రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు పిల్లలు, ఒక మహిళ గంగా నదిలో స్నానం చేశారు.
కాగా, తొమ్మిదేళ్ల సూరజ్ బలమైన ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. నదిలో మునిగిపోతున్న తమ్ముడ్ని చూసి అక్కాచెల్లెళ్లైన 15 ఏళ్ల సాక్షి, 13 ఏళ్ల వైష్ణవి వెంటనే నీటిలోకి దూకారు. సూరజ్‌ను నది ఒడ్డుకు తోసి అతడ్ని రక్షించారు. అయితే బలమైన నదీ ప్రవాహంలో అక్కాచెలెళ్లు కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాష్ట్ర విపత్తు దళాన్ని రప్పించారు. గంగా నదిలో కొట్టుకుపోయిన ఇద్దరు బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.