Vijay | తమిళ చిత్ర పరిశ్రమకు ఊరట కలిగించే కీలక నిర్ణయం వెలుగులోకి వచ్చింది. అగ్ర నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సినీ రంగ అభివృద్ధి కోసం కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్తగా విడుదలయ్యే తమిళ చిత్రాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు తమిళనాడులో కొత్త సినిమా విడుదలైనప్పుడు అదనపు షోలు ప్రదర్శించాలంటే నిర్మాతలు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. అయితే తాజా నిర్ణయంతో సినిమా విడుదలైన తొలి ఏడు రోజుల పాటు రోజుకు ఐదు షోలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.అంతేకాకుండా ప్రత్యేక ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండానే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు పరస్పర అంగీకారంతో అదనపు షోలు ప్లాన్ చేసుకునే అవకాశం కూడా కల్పించినట్లు సమాచారం.
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోలీవుడ్ ప్రముఖులు ఆయనను కలిసి ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొత్త సినిమాలకు అదనపు షోలు ఇవ్వాలని నిర్మాతలు, థియేటర్ యజమానులు కోరారు. ఈ అంశంపై సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం, కొత్తగా విడుదలయ్యే తమిళ చిత్రాలకు విడుదల తేదీ నుంచి ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఐదు ప్రదర్శనలకు అనుమతి లభించనుంది. అలాగే స్థానిక పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలు, శని, ఆదివారాల్లో ప్రత్యేక స్క్రీనింగ్‌లకు కూడా అవకాశం కల్పించేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమకు ప్రత్యేక ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలన్న అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో కోలీవుడ్‌లో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక విజయ్ చివరి చిత్రం జననాయగన్ జూన్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.