Ravichanrdran Ashwin : భారత జట్టు సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichanrdran Ashwin) వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచిన అశ్విన్ ఓ రికార్డుపై కన్నేశాడు. ప్రపంచలోనే మేటి స్పిన్నర్లలో ఒకడైన అతడు ఆ రికార్డు మాత్రం సాధించలేకపోయాడు. అవును.. ఇప్పటికీ అది నిజం కాలేదట. ఈ విషయాన్ని బంగ్లాదేశ్(Bangladesh)తో తొలి టెస్టుకు ముందు యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ అశ్విన్ వెల్లడించాడు. ఇంతకూ ఏంటా రికార్డు? ఎంటా కథా?
టీమిండియా చిరస్మరణీయ విజయాల్లో భాగమైన అశ్విన్ ఆశపడుతున్న రికార్డు ఏంటంటే.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం. అవును.. ఇదే అతగాడి కల. ‘నాకో కోరిక ఉంది. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాలి. ఆరు సిక్సర్ల రికార్డు నా పేరుతో ఉండాలని అనుకున్నా. కానీ, ఇప్పటికీ అది నిజం కాలేదు. నా సుదీర్ఘ కెరీర్లో అదొక్కటే వెలితి ఉండిపోయింది’ అని అశ్విన్ అన్నాడు.
వందో టెస్టు క్యాప్ అందుకుంటూ..
సొంత మైదానమైన చెపాక్లో చెలరేగిపోవాలని భావిస్తున్న అశ్విన్ తన కెరీర్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇంకెన్ని రోజులు క్రికెట్ ఆడుతారు? మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటీ?’ అనే ప్రశ్నలకు అశ్విన్ నిజాయతీగా సమాధానం చెప్పాడు. ‘ఏ రోజు అయితే నాకు మెరుగుపడాలనే ఆలోచన రాదో.. ఆ రోజు ఆటకు వీడ్కోలు పలుకుతా’ అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. 2011 నవంబర్లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ మాంత్రికుడు ఇప్పటివరకూ 516 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు బ్యాటుతోనూ ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తూ 5 సెంచరీలు బాదేశాడు.