Virendraa Sachdeva : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అవినీతి సీఎం అని, ఆయనకు ఎలాంటి నైతిక విలువలు లేవని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ వ్యాఖ్యానించారు. సచ్దేవ సోమవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేజ్రీవాల్ తనపై ఆరోపణలు వచ్చిన రోజే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉందని అన్నారు. ఆయన అలా చేయకపోగా జైలు నుంచి ప్రభుత్వం నడిపే డ్రామాకు తెరతీశారని దుయ్యబట్టారు.
జైలు నుంచి వచ్చిన తర్వాత తన రాజకీయ అసహనాన్ని వెళ్లగక్కే క్రమంలో రాజీనామా డ్రామాను ముందుకు తెచ్చారని ఎద్దేవా చేశారు. అవినీతి సీఎం నుంచి తమకు విముక్తి లభించిందని ఢిల్లీ ప్రజలు ఇప్పుడు సంతోషిస్తారని తాను అనుకుంటున్నానని అన్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హీట్ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రేపే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలిసింది.
కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ (Lt Governor) వీకే సక్సేనా (VK Saxena) అపాయింట్మెంట్ కోరినట్లు ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. రేపు సాయంత్రం 4:30 గంటలకు ఎల్జీని కేజ్రీ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తన రాజీనామాను ఆయనకు సమర్పించనున్నారని వార్తలు వచ్చాయి. కాగా, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
Read More :