Gautam Gambhir : భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన గౌతం గంభీర్ (Gautam Gambhir) ముక్కుసూటి మనిషని తెలిసిందే. ఆట కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన గౌతీకి ఏ విషయమైనా సరే కుండబద్ధలు కొట్టేయడం అలవాటు. తాజాగా టీమిండియా కోచ్‌గా ఎంపికైన గంభీర్ తొలి ఇంటర్వ్యూలోనే తన పనితీరు ఎలా ఉంటుందో చెప్పేశాడు. తాను బలంగా నమ్మే సిద్ధాంతం గురించి, భారత క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడడం గురించి స్పష్టంగా వివరించాడు.
‘నేను ఒక విషయాన్ని మాత్రం చాలా గట్టిగా నమ్ముతాను. ఎవరైతే బాగా ఆడుతారో వాళ్లు కచ్చితంగా మూడు ఫార్మాట్లలో ఉంటారు. మరో విషయం ఏంటంటే.. ఎవరిని ఏ ఫార్మాట్లో ఆడించాలి? గాయపడ్డవాళ్లను తిరిగి ఫిట్‌గా మార్చడం వంటి విషయాల్లో నాకు పెద్దగా నమ్మకం లేదు. అయితే.. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు మీకు సమయం చాలా తక్కువ ఉంటుంది.

ఆట అన్నాక గాయాలు సహజం. ఒకవేళ మూడు ఫార్మట్లలో ఆడే క్రికెటర్లు గాయపడితే వాళ్లు రిహాబిలిటేషన్ సెంటర్లో కోలుకొని, ఫిట్‌గా మారి మళ్లీ జట్టులోకి రావాలి. దేశానికి ప్రాతినిధ్వం వహించే సమయంలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లకు ఆడాలి. మీరు భీకర ఫామ్‌లో ఉంటే ఎంచక్కా మూడు ఫార్మాట్లలో ఆడేయొచ్చు. అందులో ఏ సందేహం లేదు’ అని గంభీర్ తెలిపాడు. అంతేకాదు ఆటగాళ్లకు వ్యక్తిగత మైలురాళ్ల మీద కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం కావాలని భారత క్రికెటర్లకు సూచించాడు.
ఐపీఎల్ మెంటార్‌గా కోల్‌కతాకు ట్రోఫీ అందించిన గంభీర్ కోచ్‌గా హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. తన సహాయక సిబ్బందిగా ఐపీఎల్ సహచరులను తీసుకోవాలని పావులు కదుపుతున్నాడు. అందులో భాగంగానే దక్షిణాఫ్రికా దిగ్గజం మోర్నీ మోర్కెల్ (Morne Morkel)ను బౌలింగ్ కోచ్‌గా.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన రియాన్ టెన్ డస్చేట్ (Ryan ten Doeschate)ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తున్నాడు.

అయితే.. బీసీసీఐ మాత్రం భారత సీనియర్ ఆటగాళ్లు సహాయ సిబ్బందిలో ఉండాలని అనుకుంటోంది. జూలై 26వ తేదీన శ్రీలంక సిరీస్ మొదలు కానుంది. ఆలోపే భారత జట్టు కోచింగ్ స్టాఫ్‌ను బీసీసీఐ ఖారారు చేసే అవకాశముంది.