Errolla Srinivas | హైదరాబాద్ : బీఆర్ఎస్ పాలనలో 115 నోటిఫికేషన్లు ఇచ్చి లక్షా 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆ పార్టీ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేయదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి, మంత్రులు.. నిరుద్యోగుల పట్ల అసహనంతో మాట్లాడుతున్నారు. నోటికొచ్చినట్లు అసభ్యపదజాలంతో దూషణలకు దిగుతున్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానించేలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం నోటికొచ్చిన మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. గ్రూప్ -1 మెయిన్స్‌కు 1:100 పిలుస్తామన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారు. ఇవన్నీ కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలే. దీంట్లో కన్ఫ్యూజన్కు గురి కావాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిక్కడపల్లి లైబ్రరీలో ఇచ్చిన హామీల మీదనే నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా దొంగల్లా పారిపోతూ అవమానించేలా మాట్లాడుతున్నారు. ఒక మంత్రి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సీఎం అసలే దొరకడం లేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.
అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు ఎన్ని భ్రమలు కల్పించారో.. వాటన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. నిరుద్యోగుల వెనుక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయనడం సరికాదు. సోయితో మాట్లాడాలి. చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేయదు. 115 నోటిఫికేషన్లు ఇచ్చి ఒక లక్ష 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. నిరుద్యోగులకు భ్రమలు కల్పించి మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి కొండను తవ్వి ఎలుకలను పట్టినట్టు 11 వేల పోస్టులతో డీఎస్సీ వేశారు. దాని వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు. వీటికి సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేం చిల్లర రాజకీయాలు చేయం. మీరే చిల్లర రాజకీయాలు చేసి నేడు నిరుద్యోగుల గోస పుచ్చుకుంటున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే వంచనకు, నయవంచనకు కేరాఫ్ అడ్రస్.. అబద్దాలకు, నిర్బంధాలకు, అణిచివేతకు కేరాఫ్ అడ్రస్.. జాబ్ క్యాలెండర్ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఓ మంత్రి ముగ్గురు మూడు రకాల మాటలు మాట్లాడారు. ఇందులో ఎవరు చిల్లరగాళ్లు. నిరుద్యోగులు చిల్లరగాళ్లు కాదు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపే ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఏడు నెలలు అవుతున్నప్పటికీ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు అని ఎర్రోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.