ECB : ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. అందరూ ఊహించినట్టే యువకెరటం హ్యారీ బ్రూక్ (Harry Brook) సారథిగా ఎంపికయ్యాడు. జోస్ బట్లర్(Jos Buttler) వారసుడిగా 26 ఏళ్ల బ్రూక్‌ను ఎంపిక చేసింది ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఈసీబీ. ఇకపై వన్డే, టీ20ల్లో బ్రూక్ ఇంగ్లండ్ సారథిగా వ్యవహరిస్తాడని వెల్లడించింది. తనను కెప్టెన్‌గా నియమించడం పట్ల బ్రూక్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవం అని చెప్పాడీ చిచ్చరపిడుగు.
‘ఇంగ్లండ్ వైట్ బాల్ జట్లకు కెప్టెన్‌గా ఎంపికవ్వడం నాకు లభించిన గొప్ప గౌరవం. చిన్నప్పటి నుంచి జాతీయ జట్టుకు ఆడాలని కలలు కనేవాడిని. యార్క్‌షైర్ టీమ్‌కు ఆడుతున్న రోజుల్లో ఇంగ్లండ్ జెర్సీ వేసుకోవాలని, కెప్టెన్‌గా అవ్వాలని ఆశ పడ్డాను. ఈరోజు ఈసీబీ నాకు సారథిగా అవకాశం ఇవ్వడంతో నా కల సాకారమైంది.
CAPTAIN BROOK 🦜
Harry Brook is our new Men’s ODI and IT20 captain!
Read more 👇
— England Cricket (@englandcricket) April 7, 2025
నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన కుటుంబసభ్యులు, కోచ్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాళ్లు నాపై పెట్టుకున్న నమ్మకాలను నిజం అయ్యాయి. కెప్టెన్‌గా జట్టును విజయాల బాటలో నడిపించడమే నా లక్ష్యం. ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుపొందడం, వరల్డ్ కప్ ట్రోఫీలు నెగ్గడం.. నా ప్రథమ లక్ష్యాలు. ఈ కొత్త సవాల్‌ను స్వీకరించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని బ్రూక్ వెల్లడించాడు.
గత ఏడాదికాలంగా వన్డే, టీ20ల్లో ఇంగ్లండ్ జట్టు స్థాయికి తగ్గట్టు ఆడడం లేదు. 2022లో పొట్టి వరల్డ్ కప్ గెలుపొందిన జోస్ బట్లర్ సేన.. నిరుడు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఛాంపియన్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. దాంతో, బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త నాయకుడి వేటలో పడిన ఈసీబీ.. బ్రూక్, లివింగ్‌స్టోన్, బెన్ డకెట్‌ల పేర్లను పరిశీలించింది.
బెన్ స్టోక్స్‌కు బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలూ వినిపించాయి. అయితే.. మాజీ ఆటగాళ్లు, బోర్డు సభ్యులు మాత్రం కుర్రాడైన బ్రూక్ వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న బ్రెండన్ మెక్కల్లమ్తో కలిసి బ్రూక్ పని చేయనున్నాడు. టీ20ల్లో, వన్డేల్లో, టెస్టుల్లో చెలరేగి ఆడే ఈ యంగ్‌స్టర్.. కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడో చూడాలి.