ముంబై: మహిళకు ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ తర్వాత ఆ వ్యక్తితో పెళ్లి వద్దనుకున్నది. దీంతో కాబోయే భర్తను హత్య చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు డబ్బులిచ్చింది. (Bride hires hitmen to kill fiance) ఆ వ్యక్తిపై జరిగిన దాడిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆ మహిళ కోసం వెతుకుతున్నారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. అహల్యానగర్‌కు చెందిన మయూరికి, మహి జల్గావ్ ప్రాంతానికి చెందిన సాగర్ జయసింగ్ కదమ్‌తో పెళ్లి సంబంధం కుదిరింది. ఈ జంటకు నిశ్చితార్థం కూడా జరిగింది.
కాగా, ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ తర్వాత సాగర్‌ను పెళ్లి చేసుకోకూడదని మయూరి నిర్ణయించింది. దీంతో కాబోయే భర్తను హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది. సహచరుడు సందీప్‌తో కలిసి కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు రూ.1.50 లక్షలు చెల్లించింది. ఫిబ్రవరి 27న మహి జల్గావ్లోని ఓ హోటల్లో కుక్‌గా పని చేస్తున్న సాగర్‌ను ఆ ప్రాంతం సమీపంలో ఐదుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. కర్రలతో దారుణంగా కొట్టి పారిపోయారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడిన సాగర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన ఐదుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా కాబోయే భర్త సాగర్‌ను హత్య చేయించేందుకు వధువు మయూరి ఆ కిల్లర్స్‌కు డబ్బులు ఇచ్చినట్లు దర్యాప్తులో పోలీసులకు తెలిసింది. దీంతో ఆమె సహచరుడు సందీప్‌తో సహా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మయూరి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.