Hardhik Pandya : ఐపీఎల్ రిటెన్షన్‌కు గడువు సమీపిస్తోంది. మరో ఆరు రోజుల్లో వేలానికి వచ్చేది ఎవరో తేలిపోనుంది. అక్టోబర్ 31 వ తేదీ సాయంత్ర 530 గంటలకల్లా 10 ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా వెలువడనుంది. 18వ సీజన్ వేలం ముందు అందరి కళ్లన్నీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) మీదనే ఉన్నాయి. ముంబై యాజమాన్యం అతడిని అట్టిపెట్టుకుంటుందా? అని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాండ్యా ఇన్‌స్ట్రామ్ స్టోరీస్‌లో అభిమానులను ఆలోచనల్లో పడేశాడు. ఇంతకూ పాండ్యా ఏం పోస్ట్ పెట్టాడంటే…
పొట్టి వరల్డ్ కప్ హీరో పాండ్యా శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేశాడు. ‘నేను త్వరలోనే పెద్ద ప్రకటన చేయబోతున్నా. కొంత సమయం వేచి ఉంటే అదేంటో మీ అందరికీ తెలుస్తుంది’ అని పాండ్యా ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దాంతో, ‘అసలు పాండ్యా ఏం చెప్పనున్నాడు?’, ‘అతడి మనసులో ఏం ఉంది?’ అని అభిమానులు తలోతీరుగా మాట్లాడుకుంటున్నారు. పాండ్యా చేయబోతున్న ఆ కీలక ప్రకటన ఏమైం ఉంటుంది? అనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన పొట్టి సిరీస్‌లో పాండ్యా రెచ్చిపోయిన ఆడాడు. మిడిల్ ఓవర్లలో బౌండరీలతో చెలరేగుతూ రాకెట్ వేగంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఉప్పల్ స్టేడియంలో అతడి తుఫాన్ ఇన్నింగ్స్ టీమిండియా రికార్డు స్కోర్‌కు ఎంతో ఉపయోగపడింది. సిరీస్ ఆసాంతం దంచిన పాండ్యా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. దాంతో, ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు తన ఫామ్‌పై సందేహాలు వద్దంటూ పాండ్యా ముంబై అభిమానలుకు చెప్పకనే చెప్పాడు.
ఐపీఎల్‌తో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న పాండ్యా 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్నాడు. అంతకుముందు రెండేండ్లలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)ను విజేతగా, రన్నరప్‌గా నిలిపిన హార్దిక్.. ముంబై తరఫున మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.
రోహిత్ శర్మను కాదని అతడికి కెప్టెన్సీ ఇవ్వడం నచ్చని అభిమానులు పాండ్యాను టార్గెట్ చేస్తూ .. గేలి చేయడం మొదలెట్టారు. సొంత మైదానమైన వాంఖడేలోనూ పాండ్యాకు తిరస్కారం తప్పలేదు. దాంతో, మానసికంగా కుంగిపోయిన అతడు మైదానంలో అద్భుతాలు చేయలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ మినహా… సీనియర్లు అందరూ నిరాశపరచడంతో ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది.