Ilayaraja | భారతీయ సంగీత ప్రపంచంలో కాపీహక్కుల వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తను స్వరపరిచిన పాటల రాయల్టీ విషయంలో నిర్మాతలతో కోర్టు పోరాటాలు చేస్తూ వస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు తాజాగా ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. పాటల హక్కుల వినియోగంపై వచ్చిన వివాదంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సినీ, సంగీత వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే… ఇండియన్ టాప్ మ్యూజిక్ కంపెనీలలో ఒకటైన సరిగమ సంస్థ వద్ద ఇళయరాజా స్వరపరిచిన దాదాపు 134 సినిమాల ఆడియో హక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. 1976 నుంచి 2001 మధ్య విడుదలైన ఈ చిత్రాల పాటల హక్కులను ఆయా నిర్మాతల నుంచి సరిగమ సంస్థ పూర్తిగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. నిర్మాతలకు నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించి శాశ్వత హక్కులను సొంతం చేసుకున్నట్లు సంస్థ వాదిస్తోంది.
అయితే ఈ నెల ప్రారంభంలో ఇళయరాజా కొన్ని పాటలను ప్రముఖ డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లైన iTunes, JioSaavn, Amazon Prime Music వంటి వేదికలపై అప్లోడ్ చేసేందుకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఈ చర్యను సరిగమ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ వద్ద హక్కులు ఉన్న పాటలను అనుమతి లేకుండా ఇతరులకు ఇవ్వడం చట్టవిరుద్ధమని సంస్థ వాదించింది. 1957 కాపీరైట్ చట్టం ప్రకారం, ఒక నిర్దిష్ట ఒప్పందం లేకపోతే సంగీత హక్కులు సాధారణంగా నిర్మాతకే చెందుతాయి. నిర్మాత ఆ హక్కులను ఎవరికైనా విక్రయిస్తే, వారు చట్టబద్ధ యజమానులవుతారు. ఈ చట్టాన్నే ఆధారంగా చేసుకుని సరిగమ సంస్థ కోర్టులో వాదనలు వినిపించింది. ముఖ్యంగా ‘Naa Iniya Pon Nilave’ పాట హక్కులపై వివాదం మరింత ఉధృతమైంది.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయమూర్తి తుషార్ రావు గెడేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సరిగమ సంస్థ వద్ద ఉన్న పాటలను ఇళయరాజా స్వతంత్రంగా వినియోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రస్తుతం సంగీత వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే ఈ నిర్ణయంపై ఇళయరాజా న్యాయపరంగా మరింత ముందుకు వెళ్లే అవకాశమున్నప్పటికీ, ప్రస్తుతానికి ఇది ఆయనకు తాత్కాలిక ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సాధారణంగా ఒక పాటను కంపోజ్ చేసి నిర్మాతకు అప్పగించిన తర్వాత చెల్లింపు తీసుకుంటే, ఆ హక్కులు నిర్మాతకే చెందుతాయని కాపీరైట్ చట్టం చెబుతోంది. అయితే ఈ చట్టంలో ఉన్న సంక్లిష్టతల కారణంగా అప్పుడప్పుడు సంగీత దర్శకులు, గాయకులు, గీత రచయితలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు.ఇళయరాజా మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని కోర్టుల వరకు తీసుకెళ్లడం విశేషం. ఈ పరిణామం భవిష్యత్తులో సంగీత రంగంలో కాపీహక్కుల చర్చను మరింత వేడెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.