Telangana | బెటాలియన్ కానిస్టేబుళ్ల దీనస్థితిపై వారి కుటుంబసభ్యులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన వేళ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. సచివాలయం వద్ద ధర్నా చేసేందుకు వచ్చిన బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులను అరెస్టు చేశారు. అదే సమయంలో అక్కడే కనిపించిన సామాన్యులను కూడా బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబీకులే అని భావించి వారిని కూడా బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.
తాము సచివాలయం చూసేందుకు వచ్చామని సదరు మహిళలు చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. తమకు, ఆ ధర్నాకు ఎలాంటి సంబంధం లేదని గగ్గోలు పెట్టించుకున్నా.. వారి మాట పట్టించుకున్న పాపాన పోలేదు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
సామాన్యులను అరెస్ట్ చేసిన పోలీసులు..!
సచివాలయాన్ని చూసేందుకు వెళ్లిన తమను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించారని వాపోయిన మహిళలు..
ఇంత దౌర్జన్యంగా నడుచుకోవడం సరికాదని కామెంట్.. https://t.co/GLmI5e3bEK pic.twitter.com/ZmiezSBa5n
— News Line Telugu (@NewsLineTelugu) October 25, 2024
కానిస్టేబుళ్ల భార్యలను కొడుతూ అరెస్టు చేసిన మహిళా పోలీసులు
బెటాలియన్ కానిస్టేబుళ్ల దుర్భర పరిస్థితిపై వారి కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నిన్నటి దాకా బెటాలియన్ ఎదుట ధర్నా చేసిన కానిస్టేబుళ్ల భార్యలు ఇవాళ రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసనలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకుని సెక్రటేరియట్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ భర్తలను కూలీల కంటే హీనంగా చూస్తున్నారని.. వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు.
బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎదురించిన బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలను, ఇతర కుటుంబసభ్యులను మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకుంటూ మరీ వాహనాల్లో తరలించారు. దీంతో సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.