Gautam Gambhir : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్లో శుభ్‌మన్ గిల్ సేన తొలి సవాల్‌కు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జూన్ 20న హెడింగ్లీ మైదానంలో మొదటి టెస్టులో ఆతిథ్య జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆలోపే జట్టుతో కలుస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిని చూసేందుకు హుటాహుటిన భారత్ చేరుకున్న గౌతీ .. జూన్ 17న ఇంగ్లండ్ బయల్దేరుతాడని సమాచారం.
జూన్ తొలి వారంలో స్క్వాడ్‌తో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లాడు గంభీర్. అక్కడ ప్రాక్టీస్ సెషన్లో ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్న అతడికి వాళ్ల అమ్మ సీమా గంభీర్(Seema Gambhir) ఆస్పత్రి పాలైందనే వార్త తెలిసింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కావడంతో గంభీర్ జూన్ 11న భారత్‌కు వచ్చేశాడు. తీవ్ర అనారోగ్యంతో దవాఖానలో చేరిన తల్లిని పరామర్శించాడు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. కానీ, ఇంకా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయినా సరే కోచ్‌గా తన బాధ్యతలు నిర్వర్తించడం కోసం అతడు ఇంగ్లండ్ విమానం ఎక్కాలనుకుంటున్నాడట.
India’s head coach will rejoin the squad three days before the start of the first Test in Leeds
Gambhir had flown back home, to Delhi, on June 11 after his mother was hospitalised. It is understood that her health has improved since.
Read more: https://t.co/biGZroK3GK pic.twitter.com/gbFGSGd32L
— ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2025
ఎందుకంటే.. సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీ వీడ్కోలుతో టాపార్డర్ బ్యాటింగ్ లైనప్ కూర్పు తలనొప్పిగా మారింది. కుర్రాళ్లలో ఎవరికి అవకాశం ఇవ్వాలి? అనేది గంభీర్ చేతుల్లోనే ఉంది. పైగా ఈ పర్యటనతో పగ్గాలు అందుకున్న శుభ్‌మన్ గిల్‌కు అన్నివిధాలా అడంగా నిలవాల్సిన కర్తవ్యం కూడా అతడిని తిరుగు ప్రయాణానికి పురిగొల్పుతోంది. దాంతో.. తొలి టెస్టుకు ముందే టీమిండియాతో కలువాలనుకుంటున్నాడు గంభీర్. ఇంగ్లండ్ చేరుకున్నాక ఓపెనింగ్ జోడీ, నంబర్ 1లో ఆడేది ఎవరు? అనే విషయంపై స్పష్టత రానుందని అభిమానులు అనుకుంటున్నారు.
నిరుడు రాహుల్ ద్రవిడ్ తర్వాత కోచ్‌గా ఎంపికైన గంభీర్ శ్రీలంక పర్యటనలో మెప్పించాడు. అయితే.. స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గడ్డపై దారుణ ఓటములు అతడి కోచింగ్‌పై సందేహాలు రేకెత్తించాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశం చేజారడంతో ఆగ్రహించిన బీసీసీఐ.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(BGT) తర్వాత గట్టిగానే క్లాస్ పీకింది. దాంతో, టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్‌ను విజయంతో ఆరంభించాలనే కసితో ఉన్నాడు గౌతీ. అందుకే.. ఇంగ్లండ్ పర్యటనను అతడు సవాల్‌గా తీసుకుంటున్నాడు.
జూన్ 11న అతడు స్వదేశం రావడంతో భారత ఆటగాళ్ల నెట్ ప్రాక్టీస్‌ను బౌలింగ్ కోచ్ మొర్నీ మోర్కెల్, సహాయక కోచ్‌లు రియాన్ డస్చేట్, సితాన్షు కొటక్‌లు పర్యవేక్షించారు. అనంతరం ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌ను సైతం వీక్షించిన ఈ త్రయం.. మెరుగవ్వాల్సిన విషయాలను సూచించారు. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్లు శతకాలతో విజృంభించిన విషయం తెలిసిందే.