Illegal cases | ఓదెల, జూన్ 16 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరసిస్తూ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు, కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షుడు మ్యాడగొని శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఫార్ములా ఈ కారు రేసులో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోటే పలు దఫాలుగా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయడానికి చూస్తుందని అన్నారు.
ఫార్ములా ఈ-కారు రేసులో తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారన్నారు. ఇందులో ఎలాంటి అవినీతికి తావు లేదని ఇప్పటికే రెండుసార్లు ఏసీబీ అధికారుల విచారణలో కేటీఆర్ తెలియజేయడం జరిగిందని, అయినా కావల్సుకొని మళ్లీ నోటీసులు ఇవ్వడం తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉండవన్నారు. బీఆర్ఎస్ నాయకుల పై రాజకీయ దాడులను ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలోజు రమేష్, బోడగుంట నరేష్, చర్లపల్లి సురేష్ గౌడ్, మద్దెల శ్రీనివాస్, జొంగోని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.