IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ వేలానికి ఇంకో నెలపైనే ఉంది. ఆలోపే అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితా ఇవ్వాలని ఫ్రాంచైజీలకు ఆదేశాలు వచ్చేశాయి. అందుకు అక్టోబర్ 31 వరకు గడువు. ఇంకేముంది.. రిటెన్షన్‌పై జోరుగా చర్చ నడుస్తోంది. ఫలానా జట్టు ఆ ఐదుగురిని అట్టిపెట్టుకుంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాప్ ఆటగాళ్లను రిటైన్ చేసుకోనుందని.. వాళ్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) ఒకడని కథనాలు వస్తున్నాయి.
అయితే.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ(Tom Moody) మాత్రం పాండ్యాను రూ. 18 కోట్లకు కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ’17వ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను రోహిత్ ఒక భ్రమ అనుకోవాలి. ఇక ముంబై అట్టిపెట్టుకునే ఆటగాళ్ల విషయానికొస్తే.. పేసర్ బుమ్రా, చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్‌లను రూ.18 కోట్లకు రీటైన్ చేసుకోవాలి. హార్దిక్ పాండ్యాకు రూ.14 కోట్లు చాలు. అతడి ప్రదర్శన, ఫిట్నెస్ చూస్తే.. అంతకన్నా తక్కువ మొత్తానికే కొనసాగించొచ్చు.
ఏ రకంగా చూసినా హార్దిక్ రూ. 18 కోట్లకు అర్హుడు కాదు. నిజానికి అన్ని కోట్లు పలికే ఆటగాడు మ్యాచ్ విన్నర్ అయి ఉండాలి. కానీ, పాండ్యా గత సీజన్లో బ్యాటింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. కెప్టెన్‌గానూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ముంబై రిటైన్ చేసుకొనేవాళ్లలో యువ కెరటం తిలక్ వర్మ కచ్చితంగా ఉంటాడు’ అని మూడీ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో వెల్లడించాడు.
పదిహేడో సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) నుంచి ముంబై ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను కొన్నది. ఆ వెంటనే ఐదుసార్లు ట్రోఫీ కట్టబెట్టిన రోహిత్‌ను తప్పించి అతడికి పగ్గాలు అప్పగించింది. అక్కడితో మొదలు టోర్నీ ముగిసేదాకా పాండ్యా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అభిమానుల తిరస్కరణతో పాటు.. డ్రెస్సింగ్ రూమ్‌లో పొసగని వాతావరణం కూడా పాండ్యా ఆటపై, కెప్టెన్సీపై ప్రభావం చూపింది.
దాంతో.. ముంబై 3 విజయాలతో ప్లే ఆఫ్స్ ముందే ఇంటిదారి పట్టింది. దాంతో.. 18వ సీజన్లో పాండ్యాను తప్పించి మళ్లీ రోహిత్‌కే పగ్గాలు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరోవైపు.. హిట్‌మ్యాన్ ముంబైని వీడి వేలానికి వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. వీటన్నింటికీ రిటెన్షన్ గడువు అయిన అక్టోబర్ 31లోపు స్పష్టత వచ్చే అవకాశముంది.