ODI World Cup 2027 : కరీబియన్ గడ్డపై టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న మరుక్షణమే పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికి రోహిత్ శర్మ (Rohit Sharma) అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కెప్టెన్‌గా దేశానికి తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన హిట్‌మ్యాన్ ప్రస్తుతం టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2024-05) ఫైనల్ లక్ష్యంగా జట్టును నడిపిస్తున్నాడు. అయితే.. మరో రెండు మూడు ఏండ్లలో టెస్టులు, వన్డేలకు కూడా రోహిత్ అల్విదా పలికే అవకాశముంది.
ఈ నేపథ్యంలో భారత సారథి వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ, అభిమానులు మాత్రం 2027 వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో అతడే టీమిండియా కెప్టెన్‌గా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో కోచ్ గంభీర్‌తో కలిసి మాస్టర్ ప్లాన్ వేసిన రోహిత్ విజయవంతం అయ్యాడు. సిరీస్ ముగియడంతో రిలాక్స్ అవుతున్న హిట్‌మ్యాన్ తాజాగా ముంబైలో ఓ ఈవెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్నవాళ్లంతా అతడిని వచ్చే వరల్డ్ కప్ వరకూ సారథిగా ఉండాల్సిందిగా కోరారు.
Public Demand!!!
Rohit Sharma should lead India in 2027 worldcup ❤️😍 pic.twitter.com/Zbruf8TNnp
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) October 3, 2024
‘దేశంలోని అభిమానులందరి తరఫున నా విన్నపం ఒక్కటే.. రోహిత్ శర్మ మరో వరల్డ్ కప్ వరకూ కెప్టెన్‌గా ఉండాలి. మీరు ఇంకో వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా టీమిండియాను నడిపించాలని దేశమంతా కోరుకుంటోంది’ అని రోహిత్‌తో ఓ ఫ్యాన్ అన్నాడు. మిగతావాళ్లంతా సదరు అభిమాని అభిప్రాయంతో ఏకీభవిస్తూ ‘రోహిత్.. రోహిత్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ కల బార్బడోస్‌లో నిజమైంది. 17 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టుకు రెండో టీ20 వరల్డ్ కప్ అందించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నీలు ఆడింది. నిరుడు డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ రెండు ఐసీసీ ట్రోఫీలు చేజార్చుకుంది.