మేడ్చల్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని డబుల్‌బెడ్ రూమ్‌ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యంతో పాటు మేడ్చల్ నియోజకర్గంలోని 12 డబుల్ బెడ్రూమ్ల కాలనీలలో సౌకర్యాల ఏర్పాటులో నిర్లక్ష్యం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు 4 వేల డబుల్ బెడ్రూమ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బౌరంపేట్, గాగిల్లాపూర్, దుండిగల్ ప్రాంతాలలో నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి డ్రైనేజీ, వాటర్ వర్స్, విద్యుత్ సంబంధిత పనులను చేపట్టాల్సి ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను త్వరితిగతిన పూర్తి చేసి మిగతా పనులను చేపట్టాల్సి ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ కాలనీలకు అప్రోచ్ రోడ్ల పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. మే చివరి వరకు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు పూర్తి పూర్తి చేస్తామని చెబుతున్నప్పటికీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదని వాపోతున్నారు. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని 12 డబుల్ బెడ్రూమ్ కాలనీలలో మౌళిక వసతులు కల్పించాలని డబుల్‌బెడ్ రూమ్‌లలో నివసిస్తున్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అన్ని రకాల వసతులు కల్పించాలి
డబుల్ బెడ్రూమ్ల కాలనీలలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసిన వెంటనే మౌళిక వసతులతో పాటు పాఠశాలలు, పార్క్‌లు, అంగన్వాడి కేంద్రాలు, రేషన్ దుకాణలు, బస్సు సౌకర్యాలను కల్పించాలి. డబుల్‌బెడ్‌రూమ్‌లు పూర్తయిన కాలనీలలో కొన్నింటికి అప్రొచ్ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా అధికారులు దృష్టి సారించాలి. పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలి.
– కేపీ. వివేకానంద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే