మెదక్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఎల్నినో ప్రభావంతో మెదక్ జిల్లాలో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు తక్కువ నీటితో సాగుచేయగల పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తక్కువ నీరు..ఎక్కువ లాభం వచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని సూచించారు. సంప్రదాయ వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే వర్షభావ పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం జరగదన్నారు.
మెదక్ జిల్లాలో ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లాలోని 12 రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహిస్తామన్నారు. మేళలో కంది, పెసర, మినుములు, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లాలోని అల్లాదుర్గా, రేగోడ్, శంకరంపేట(ఏ), టేక్మాల్, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం, వెల్దుర్తి, మాసాయిపేట, నర్సాపూర్, శివంపేట, మనోహరాబాద్, తూప్రాన్, మెదక్, హవేళిఘనపూర్, పాపన్నపేట, శంకరంపేట(ఆర్), చేగుంట, నార్సింగి, నిజాంపేట, రామాయంపేట మండల క్లస్టర్లో వరిసాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు రైతు వేదికలను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు.