చేర్యాల, జూలై 26: బీఆర్ఎస్ సర్కారు పాలనలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవతో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణం జరిగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి సమీపంలో రాజీవ్ రహదారి వద్ద నిర్మించిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవానికి ఆదివారం ఆయన హాజరై మాట్లాడారు.కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం పేరిట రైల్వేస్టేషన్ నిర్మించి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేలైన్ మార్గం నిర్మాణంతో గజ్వేల్, సిద్దిపేట, కొమువరెల్లి, సిరిసిల్ల ప్రాంతాలకు మెరుగైన ప్రయాణ వసతి ఏర్పడుతుందన్నారు.
భవిష్యత్‌లో రైల్వేలైన్ ప్రాంతీయ అభివృద్ధి, రవాణా సౌకర్యాల విస్తరణకు కీలకం కానుందన్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధి కేసీఆర్ పాలనలో జరిగిందని, భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు కేంద్రం ప్రసాద్ పథకంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వేలైన్ ప్రాజెక్టు పనుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా భూసేకరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50.50 నిధుల భాగస్వామ్యంతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు. భూసేకరణ వేగవంతంగా చేయడం వల్ల రైల్వేస్టేషన్ నిర్మాణానికి ఉపయోగపడిందన్నారు. కేసీఆర్ నిధులు, కేటాయింపులు, భూసేకరణ చేసిన అనంతరం తన్నీరు హరీశ్‌రావుకు నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా చూడాలని బాధ్యతలు అప్పగించడంతో మొదటి విడతతో గజ్వేల్, సిద్దిపేట, దుద్దెడ, లకుడారం తదితర పనులు పూర్తయ్యాయన్నారు.
అనంతరం కొమురవెల్లి రైల్వే స్టేషన్ పనులు ఊపందుకున్నట్లు తెలిపారు. కొమురవెల్లి మల్లన్నను తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్, దక్షిణ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుంటారన్నారు. రైల్వేలైన్ ప్రాజెక్టు సాహకారానికి కృషి చేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రాజెక్టు పూర్తి చేయడంలో భాగస్వామ్యమైన కేంద్ర రైల్వేశాఖకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆయనతో చేర్యాల టౌన్, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు భారీగా తరలి వచ్చారు.