సిటీ బ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలకు బస్తీబాట పుణ్యమాని పరిష్కారం దొరుకుతున్నది. చిన్న చిన్న సమస్యల నుంచి దీర్ఘకాలికంగా తిష్ట వేసిన సమస్యలకు అధికారుల నిర్లక్ష్యంతో ఆగుతూ సాగుతూ మరమ్మతు పనులు జరిగేవి. లైన్మెన్ల నుంచి మేనేజర్ల దాకా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తుండటంతో వినియోగదారులు రోజుల తరబడి ఇబ్బందులు పడుతుండేవారు. పైప్లైన్లు, మ్యాన్హోళ్ల మరమ్మతుల కోసం కాలనీలు, బస్తీల్లో రోడ్లను తవ్వి రోజుల తరబడి అలాగే వదిలేసేవారు. దీంతో ఆ మార్గాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారుతుండేంది.
గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. మరమ్మతుల కోసం గుంతలు తవ్వి వదిలేయడంతో మురుగు చేరి తాగునీరు కలుషితమవుతున్న ఘటనలు వెలుగు చూసేవి. బస్తీబాట పేరుతో కొద్దిరోజులుగా జలమండలి ఉన్నతాధికారులు కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తున్నారు. నేరుగా ఎండీ, జేఈడీ, ఈడీలు రంగంలోకి దిగారు. రోజుకో బస్తీ చొప్పున తిరుగుతుండటంతో కిందస్థాయి అధికారులు అప్రమత్తవుతున్నారు. దీంతో దీర్ఘకాలికంగా మరమ్మతులకు నోచుకోని పైప్లైన్లు, మ్యాన్హోళ్లకు మోక్షం లభిస్తున్నదని బస్తీవాసులు చెబుతున్నారు.
అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో తాగు నీరు సమయానికి రాకపోవడం, పనిచేయని మీటర్ల స్థానంలో కొత్తవి అమర్చేందుకు సంబంధిత ఏజెన్సీలు సకాలంలో రావడం లేదనే ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తున్నది. వినియోగదారులు సైతం క్షేత్రస్థాయి అధికారుల అలసత్వాన్ని ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. అధికారులు బస్తీబాట సమయంలో అప్రమత్తంగా ఉండి.. తర్వాత యథాతథంగా కొనసాగకుండా చూడాలని వినియోదారులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఒకవైపు బస్తీబాట కొనసాగుతున్నా లీకేజీలు, లో ప్రెజర్, తాగునీటి కాలుష్యం తగ్గకపోవడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
బస్తీబాట సాగుతున్నా తగ్గని సమస్యలు
జలమండలి అధికారులు రోజుకో బస్తీ చొప్పున తిరిగి స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సత్ఫలితాలిస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో లీకేజీలు, తాగునీటి కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. ఇటీవల బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వెనుక కాలనీలో రెండు రోజుల పాటు తాగునీటిలో మురుగు నీరు వస్తోంది. దీంతో కాలనీ వాసులు రెండు రోజుల పాటు అవస్థలు పడ్డారు. అదేవిధంగా కొండాపూర్లోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా లోప్రెజర్ కారణంగా తాగునీటి సరఫరా జరగకపోవడంతో ఆయా కాలనీల ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్14లోని కేఎల్ టవర్ ప్రాంతంలో లైన్మెన్ తీరుతో నీటి సరఫరా సరిగ్గా జరగకపోవడంతో కొద్దిరోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు బస్తీల్లో మ్యాన్ హోళ్ల మరమ్మతులకు రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు. దీంతో ఆయా కాలనీ ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా పలు ప్రాంతాల్లో సమస్యలు తిష్టవేసి ఉంటుండటం జల మం డలి పనితీరును ప్రశ్నిస్తున్నది. ఉన్నతాధికారులతో పాటు కిందిస్థాయి అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.