T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ పోటీలు మొదలై నాలుగు రోజులైంది. పవర్ హిట్టర్ల విధ్వంసంతో, స్టార్ ఆటగాళ్ల రికార్డులతో దద్దరిల్లాల్సిన స్టేడియాలు కాస్త మిన్నకుండిపోయాయి. అందుకు కారణం ఆతిథ్య అమెరికా (USA), కెనడా(Canada) మ్యాచ్‌లో తప్పిస్తే 190 ప్లస్ స్కోర్ ఒక్క మ్యాచ్‌లోనూ నమోదవ్వలేదు. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(Nassau County)లో మ్యాచ్ అంటే చాలు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం వణికిపోతున్నారు. ఊహించని బౌన్స్, అంతుచిక్కని నిస్సౌ పిచ్‌పై పసికూన జట్టు బౌలర్లు సైతం హడలెత్తిస్తున్నారు.
నస్సౌ స్టేడియంలో శ్రీలంకపై దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జి 4 వికెట్లతో చెలరేగగా.. ఐర్లాండ్‌పై భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) 2 వికెట్లు తీసి ఆరు పరుగులిచ్చాడంతే. దాంతో, న్యూయార్క్ స్టేడియంలో కృత్రిమంగా నిర్మించిన ఈ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కామెంటేటర్ నవ్జ్యోతో సింగ్ సిద్దూ (Navjot Singh Sidhu) అయితే ఏకంగా ‘ఇది పిచ్ కాదు మంత్రగత్తె’ అని వ్యాఖ్యానించాడు. భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ సైతం స్పందిస్తూ.. ‘ఇది ప్రపంచలోనే కష్టమైన పిచ్’ అని అన్నాడు.
నస్సౌ స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే ఐసీసీ మాత్రం వేదిక మార్చే ఆలోచనలో లేనట్టు సమచారం. నిస్సౌ స్టేడియంలోనే టీమిండియా గ్రూప్ దశలో మిగిలిన మూడు మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 9న పాకిస్థాన్‌తో ఫైట్ కూడా ఇక్కడే కావడం భారత శిబిరంలో ఆందోళన రేపుతోంది.
ఎందుకంటే.. మామూలు పిచ్‌ల మీదే రెచ్చిపోయే షాహీన్ ఆఫ్రిది(Shaheen Afridi), నసీం షా, మహ్మద్ అమిర్‌లు.. ఇక బౌన్సీ పిచ్‌పై ఏ స్థాయిలో విజృంభిస్తారో ఊహించలేం. టీమిండియాకు కూడా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా పాటు అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) రూపంలో నాణ్యమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు. దాంతో, జూన్ 9 ఆదివారం టాస్ గెలిచిన జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.