అమరావతి: ఏపీ ప్రజలు వైసీపీ (YCP) అందించిన బెటర్ పాలన కంటే కూటమి నుంచి ఎక్కువ ఆశించడం వల్లే తాము ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఫలితాలను (Results) ఆయన విశ్లేషిస్తూ రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని పారదర్శకంగా పాలన అందించామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు చేపట్టామని అయినా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఓటమి తీర్పును అంగీకరిస్తున్నామని అన్నారు. వైసీపీ పాలనలో అసంపూర్తిగా మిగిలిపోయిన పథకాలను, పనులను వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి అవినీతి లేని పాలన అందించామని, దానిని కొనసాగిస్తారని కోరుకుంటున్నామన్నారు.
కూటమి పాలన చూసిన తరువాత సమయం వచ్చినప్పుడు స్పందిస్తామని వెల్లడించారు. మా కంటే మంచి పాలనను అందిస్తే ప్రశంశిస్తామని, లేని పక్షంలో ప్రజలతో కలిసి నిలదీస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు మెగా డీఎస్సీ, ఓపీఎస్ హామీ , ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా తదితర వాటిని నెరవేర్చాలని సూచించారు.