Akash Deep : రాంచీ టెస్టులో డెబ్యూ క్యాప్ అందుకున్న బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) అంచనాలను అందుకున్నాడు. ఇంగ్లండ్(England) టాపార్డర్‌ను కకావికలం చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. బుల్లెట్ లాంటి బంతులతో తొలి మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తూ సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రాంచీలో అతడి స్పెల్ చూసినవాళ్లంతా మరో ఫాస్ట్ బౌలర్ దొరికాడంటూ ఆకాశ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.
అయితే.. భారత జట్టుకు ఆడాలనే కలల ప్రయాణంలో 27 ఏండ్ల ఆకాశ్ ఎన్నో కష్టాలు భరించాడు. అసలు అతడికి క్రికెట్ మీద ఇష్టం ఎలా పెరిగిందంటే..? ఆకాశ్ దీప్ సొంతూరు బిహార్‌లోని ససారాం. అతడి తండ్రి రాంజీ సింగ్(Ramji Singh) ఓ స్కూల్ టీచర్. దాంతో, ఆయన కొడుకును చదువుపై దృష్టి పెట్టాలని పదే పదే చెప్పేవాడు. కానీ, అకాశ్కు క్రికెటర్ అవ్వాలనే కోరిక ఉండేది. 2007లో టీ20 వరల్డ్ కప్‌ను టీవీలో చూశాక ఆ కోరిక మరీ ఎక్కువైంది.

ఆకాశ్ 2010లో దుర్గాపూర్‌లోని తమ అంకుల్ ఇంటికి వెళ్లాడు. అక్కడ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని స్థానిక అకాడమీలో బ్యాటర్‌గా చేరాడు. అతడిని గమనించిన కోచ్‌లు బౌలర్‌గా రాణిస్తావని చెప్పారు. అలా.. బౌలింగ్ మీద ఫోకస్ పెట్టిన ఆకాశ్ జీవితం తండ్రి మరణంతో ఒక్కసారిగా తలకిందులైంది.
పక్షపాతంతో తండ్రి మరణించిన కొన్ని రోజులకు ఆకాశ్ సోదరుడు కూడా చనిపోయాడు. ఈ రెండు విషాదాల కారణంగా ఆకాశ్ సొంతూరుకు వెళ్లిపోయాడు. అక్కడితో తన కల కలగానే మిగిలిపోతుందనే బాధ అతడిని వెంటాడింది. అయితే.. మూడేండ్ల తర్వాత అంకుల్ చొరవతో బెంగాల్‌లోని యునైటెడ్ క్లబ్లో చేరాడు. అక్కడ అతడు బెంగాల్ పేర్ రనదేవ్ బోస్(Randev Bose) కంట్లో పడ్డాడు. రనదేవ్ శిక్షణలో రాటుదేలిన ఆకాశ్ బెంగాల్ అండర్-23 జట్టుకు ఎంపికయ్యాడు. అంతలోనే వెన్నెముక గాయం కావడంతో అతడి సంతోషంలో ఆవిరైంది. ఆ కష్ట సమయంలో బెంగాల్ కోచ్ సౌరాశిష్ లహిరి అండగా నిలవడంతో ఆకాశ్ తొందరగా కోలుకుని మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు.
నిలకడగా రాణించిన ఆకాశ్ 2019లో బెంగాల్ రంజీ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. రంజీల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆకాశ్ దీప్‌ను 2021 ఐపీఎల్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కొన్నది. అక్కడితో ఆకాశ్ జీవితం మారిపోయింది. ఆ వెంటనే అతడు 2022లో ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక య్యాడు.
తల్లి లద్దుమా దేవీ ఆశీర్వాదం తీసుకున్న ఆకాశ్

అనంతరం రంజీల్లో నిలకడైన ప్రదర్శనతో ఆకాశ్ జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. రాంచీ టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చి.. తన టెస్టు కలను నిజం చేసుకున్నాడు. రాంచీ మైదానంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్న ఆకాశ్ అనంతరం తల్లి లద్దుమా దేవీ పాదాలకు నమస్కరించాడు.