IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సెంచరీతో గర్జించాడు. మూడేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో అతడు శతకం సాధించడం విశేషం. తొలి సెషన్లో సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీతో స్టోక్స్ మూడంకెల స్కోర్ అందుకున్నాడు. టెస్టుల్లో ఇంగ్లీష్ సారథికి ఇది 14వ సెంచరీ. అంతేకాదు ఒక టెస్టులో ఐదు వికెట్లు.. ఆపై వందతో చెలరేగిన నాలుగో ఇంగ్లండ్ ఆటగాడిగా స్టోక్స్ రికార్డు సృష్టించాడు. ఈ ఆల్‌రౌండర్ కంటే ముందు వెటరన్ ప్లేయర్లు టోనీ గ్రెగ్, ఇయాన్ బోథమ్(5 పర్యాయాలు), గస్ అట్కిన్సన్లు ఈ రికార్డు సాధించారు.
ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో దంచికొడుతున్న స్టోక్స్ సెంచరీతో పాటు 7వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఈ ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన పదమూడో ఇంగ్లండ్ ఆటగాడిగా ఈ ఆల్‌రౌండర్ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో 7 వేల రన్స్.. 200లకు పైగా వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడీ డాషింగ్ బ్యాటర్. గ్యారీ సోబర్స్(8,032 పరుగులు, 235 వికెట్లు), జాక్వెస్ కలిస్(13,289 రన్స్, 292 వికెట్లు)లు మాత్రమే ఈ అరుదైన క్లబ్లో ఉన్నారు. ప్రస్తుతం అతడు 107 రన్స్ చేయగా… బ్రైడన్ కార్సే(18 నాటౌట్) సమయోచితంగా ఆడుతున్నాడు. 8 వికెట్ల నష్టానికి 603 రన్స్ చేసిన ఆతిథ్య జట్టు 245 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Englishmen with a century and a five-wicket haul in the same Test:
Tony Greig
Ian Botham (5 times)
Gus Atkinson
𝗕𝗲𝗻 𝗦𝘁𝗼𝗸𝗲𝘀 pic.twitter.com/geYQqRkkro— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2025
సిరీస్‌లో కీలకమైన నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు డ్రైవింగ్ సీట్లో ఉంది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకూ అందరూ రాణించడంతో ఆ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఓపెనర్లు బెన్ డకెట్(94), జాక్ క్రాలే(84) శుభారంభమివ్వగా.. మూడో రోజు జో రూట్ (150), ఓలీ పోప్(71)లు విధ్వంసం కొనసాగించారు. సుందర్ వరుస ఓవర్లలో పోప్, హ్యారీ బ్రూక్(3)ను ఔట్ చేసి ఉపశమనం ఇచ్చాడు.
రూట్ సెంచరీ అభివాదం
కానీ, రూట్ సాయంతో బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ భారత బౌలర్లను పరీక్షిస్తూ పరుగుల పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలోనూ రూట్ 38వ సెంచరీ సాధించగా.. స్టోక్స్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. మధ్యలో కండరాలు పట్టేయడంతో బ్రేక్ తీసుకున్న అతడు.. ఏడో వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ కొనసాగించాడు. మూడో రోజు అజేయంగా నిలిచి జట్టు కొండంత స్కోర్‌లో భాగమయ్యాడు.