న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : తొలిసారి చేపట్టిన డీఎన్ఏ ఆధారిత లెక్కింపులో భారత్లో అడవి ఏనుగులు సరాసరి 22,446 ఉన్నట్టు తేలింది. 2017 నాటి ఏనుగుల సంఖ్యతో(27,312) పోల్చితే 2025లో వాటి జనాభా 18 శాతం తగ్గుదల నమోదైంది. మంగళవారం కేంద్రం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. ‘ద ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్-2025’ ప్రకారం, మనదేశంలో అడవి ఏనుగుల జనాభా 18,255 నుంచి 26,645 మధ్య ఉండొచ్చు.
2021లో మొదలైన సర్వే నివేదిక నాలుగు సంవత్సరాలు ఆలస్యంగా విడుదల కావటం గమనార్హం. ఏనుగుల జన్యు విశ్లేషణ, డాటా ధృవీకరణ కారణంగా ఆలస్యమైనట్టు అధికారులు తెలిపారు.